మహారాష్ట్రలో ఏక్‌నాథ్ టీం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఈ రెండింటి మధ్య అంగీకారం కుదిరినట్టు తెలిసింది. బీజేపీకి 25 మంత్రిసీట్లు, షిండే వర్గానికి 13 బెర్తులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
ముంబయి: శివసేనలో తిరుగుబాటుతో రాష్ట్ర రాజకీయం తలకిందులైంది. విపక్షంలో ఉన్న బీజేపీ అధికారంలోకి రాగా.. అధికార కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీ అపోజిషన్‌లోకి వెళ్లాయి. కానీ, శివసేన పరిస్థితి మాత్రం అటూ ఇటూగా ఉన్నది. తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ మద్దతుతో సీఎం కుర్చీ ఎక్కారు. సీఎంగా ఏక్‌నాథ్ షిండే.. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం తీసుకున్నారు. మంత్రుల ఎంపిక తర్వాత ఉంటుందని అప్పుడే చెప్పారు. తాజాగా, సీఎం ఏక్‌నాథ్ షిండే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, మంత్రివర్గ విస్తరణలో బెర్తులపైనా ఏక్‌నాథ్ షిండేకు, బీజేపీకి మధ్య ఫార్ములా సెట్ అయినట్టూ తెలిసింది.
షిండే టీమ్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి ఫార్ములా.. బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రిగా ఎంపిక చేయడానికి అంగీకారం కుదిరినట్టు తెలిసింది. అంతేకాదు, కీలక పోర్ట్‌ఫోలియోల కేటాయింపులపైనా విశ్వసనీయ వర్గాలు కీలక విషయాలు చెప్పాయి.
షిండే వర్గానికి క్యాబినెట్‌లో 13 సీట్లు, బీజేపీకి 25 సీట్లు దక్కబోతున్నట్టు వివరించాయి. అంతేకాదు, హోం శాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలను బీజేపీ తీసుకోబోతున్నట్టు తెలిపాయి.
గతంలో శివసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు సీఎంగా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్.. హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఈ సారి బీజేపీ హోం శాఖతోపాటు రెవెన్యూ, ఫైనాన్స్, పీడబ్ల్యూడీని కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. కాగా, మహా వికాస్ అఘాదీ ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే పట్టణాభివృద్ధి పోర్ట్‌ఫోలియో, ఎస్ఎస్ఆర్‌డీసీ పోర్ట్‌ఫోలియోలకు బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కూడా.. పట్టణాభివృద్ధి శాఖ, ఇరిగేషన్‌ను షిండే వర్గమే తీసుకోబోతున్నట్టు తెలిసింది.
ఈ మంత్రివర్గ విస్తరణ ఈ నెల 11వ తేదీ తర్వాతే చేపట్టనున్నట్టు తెలిసింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం.. ఏక్‌నాథ్ సహా 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 11వ తేదీన విచారించనుంది. ఈ విచారణ తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
