ముంబై: ఐదేళ్ల బాలుడిని కుప్పకూలిన భవనాల శిథిలాల నుండి సురక్షితంగా కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలో సోమవారం నాడు సాయంత్రం ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భవనం కుప్పకూలిన ఘటన విషయం తెలిసిన తర్వాత  ఎన్డీఆర్ ఎఫ్ కు చెందిన మూడు బృందాలు సహాయక చర్యలను చేపట్టారు. 

రాయ్ ఘడ్ జిల్లాలోనని మన్నాడులోని ఐదంతస్తుల భవనం నుండి 9 మందిని సోమవారం నాడు సాయంత్రం రక్షించారు.18 మంది ఇంకా ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు ప్రకటించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎప్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు, డాగ్ స్క్వాడ్స్ ఆచూకీ లేకుండా పోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

also read:మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం: శిథిలాల కింద 70 మంది

భవన శిథిలాల కింద ఐదేళ్ల బాలుడిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంగళవారం నాడు బయటకు తీశారు. గ్యాస్ కట్టర్లతో పాటు ఇతర పరికరాల సహాయంతో బాలుడిని  సురక్షితంగా బయటకు తీశారు.సురక్షితంగా బయటపడిన బాలుడిని మహ్మద్ నదీమ్ బాంగీగా గుర్తించారు. అతడికి స్వల్ప గాయాలైనట్టుగా పోలీసులు తెలిపారు.

బాలుడు సురక్షితంగా బయటపడడంతో బాలుడి బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.  శిథిలాల కింద ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు చిక్కుకొన్నారు. ఒక మహిళతో పాటు  ఇద్దరు పిల్లలు శిథిలాల కింద ఉన్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ఘటనలో ఇప్పటికే 60 మంది సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు.