Srivari Temple Navi Mumbai : న‌వీ ముంబ‌యిలో  శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాని సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి (TTD) విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ‌ మంత్రి ఆదిత్య థాక్రే అందజేశారు. 

Tirupati Temple in Navi Mumbai : నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం.. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి (TTD)కి విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే శనివారం అందజేశారు. బోర్డు సమావేశంలో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ట్రస్టుబోర్డు సభ్యులు, టీటీడీ అధికారుల సమక్షంలో టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి పత్రాలను అందజేశారు. 

అంత‌కు ముందు మంత్రి ఆదిత్య థాక్రే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో శ్రీవేంకటేశ్వర స్వామిని ద‌ర్శించుకున్నారు. నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి ప‌త్రాల‌ను శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహం ముందు ఉంచి పూజ‌లు చేయించారు. అనంత‌రం ఆ ప‌త్రాల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల‌కు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సభ్యుడు మిలింద్ నార్వేకర్, యువసేన నాయకులు రాహుల్ కనల్, సూరజ్ చవాన్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయ ట్రస్ట్‌కు చెందిన ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రేమండ్ గ్రూప్ చైర్మన్ మరియు ఎండి శ్రీ గౌతమ్ సింఘానియా తరపున, రేమండ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ సరిన్ ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ ఆదిత్య థాక్రే , శ్రీ సంజీవ్ సారిన్‌లను టీటీడీ చైర్మన్ సత్కరించారు.

కాగా, మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం (మ‌హారాష్ట్ర సంకీర్ణ ప్ర‌భుత్వం) మహారాష్ట్ర స‌హా పశ్చిమ భారత రాష్ట్రాల్లోని లక్షలాది మంది శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆలయ నిర్మాణం కోసం నవీ ముంబ‌యిలో స్థలాన్ని కేటాయించడం పట్ల టీటీడీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, బెంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, జమ్మూకాశ్మీర్‌, న్యూఢిల్లీ, కురుక్షేత్ర, రిషికేశ్‌లలో ఆలయాలను నిర్మించింది. అయితే, న‌వీ ముంబ‌యిలో నిర్మిస్తున్న ఈ టీటీడీ ఆల‌యం పశ్చిమ భారతదేశంలో మొద‌టిది. ఈ ఏడాది ఫిబ్రవరిలో TTD నుండి వచ్చిన అభ్యర్థనను అనుసరించి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం తిరుపతి ఆల‌యాన్ని పోలిన విధంగా ప్రతిరూపాన్ని నిర్మించడానికి రాబోయే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌కు సమీపంలో ఉల్వే వద్ద 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ఆమోదించింది.

TTD-మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కొత్త దేవాలయం నిర్మించ‌నుంది. దీని నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇది భక్తులు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే కేంద్ర బిందువుగా మారుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని మరియు అనేక మందికి ఉపాధిని కల్పించాలని TTD, మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి. కాగా, ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న 850 మీటర్ల ఎత్తులో ఉన్న తిరుమల కొండలలో 7వ శిఖరంపై నెలకొని ఉన్న తిరుపతి దేవాల‌యానికి ఏటా సగటున మూడు-నాలుగు కోట్ల మంది భక్తులు వ‌స్తారు. ప్రజల సమర్పణలు మరియు విరాళాల నుండి సేకరించబడిన ఆదాయాల పరంగా - సంవత్సరానికి సుమారు రూ. 3,000 కోట్లు వ‌స్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా కూడా పేరుగాంచింది.