ఇప్పటికే కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  61 లక్షల 45 వేలకు చేరింది.

గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776  మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది.

దేశ వ్యాప్తంగా  9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.01 శాతంగా నమోదైంది. ఇలాంటి పరిస్ధితుల్లోనే భారత్‌లో మరో భయంకరమైన కాంగో జ్వరం అడుగుపెట్టింది.

సీసీహెచ్ఎఫ్ అనేది బున్యావిరిడే కుటుంబానికి చెందిన టిక్-బర్న్ వైరస్ (నైరోవైరస్) వల్ల కలిగే ఒక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ఈ వ్యాధికి గురయితే తీవ్రమైన జర్వం వస్తుంది.

ఈ వ్యాధికి ఇంతవరకు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం సూదల పునర్వినియోగం, వైద్యసామాగ్రి కలుషితం కావడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం ఇది గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాకు దగ్గరగా వుంది.

ఇప్పటికే వల్సాద్‌ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కాంగో జ్వరం వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పాల్ఘర్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే ఒక సర్క్యులర్‌లో సిసిహెచ్‌ఎఫ్ గుజరాత్‌లోని కొన్ని జిల్లాల్లో కనుగొనబడిందని, ఇది మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. ఇది పశువుల పెంపకందారులు, మాంసం విక్రేతలు,  పశుసంవర్ధక అధికారులకు ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

దీనికి సరైన వ్యాక్సిన్‌ లేదా మందులు, చికిత్స అందుబాటులో లేని కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని కాంబ్లే సూచించారు. ఈ వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేయకపోతే 30 శాతం మంది రోగులు మరణిస్తారని ఆయన తెలిపారు.