మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటన మహారాష్ట్రలోని బీవండి నగరంలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

 బీవండీ నగరంలోని 21 ఫ్లాట్లు ఉన్న జిలానీ అపార్టుమెంటు  ఆదివారం అర్దరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఫ్లాట్ల నివాసులు గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. మూడు అంతస్తుల 69వనంబరు జిలానీ అపార్టుమెంటును 1984వ సంవత్సరంలో నిర్మించారు. 

ఈ భవనం కూలిపోవడంతో స్థానికులు, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల కింద చిక్కుకుపోయిన 25 మందిని స్థానికులు రక్షించారు. మరో 20నుంచి 25 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. స్థానికులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో బీవండీ నగరంలోని పటేల్ కాంపౌండులో గందరగోళం నెలకొంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టింది.