మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 5 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. బాలుడి అక్క.. వీధికుక్కలను తరిమి కొట్టడానికి ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. 5 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. బాలుడి అక్క.. వీధికుక్కలను తరిమి కొట్టడానికి ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. దీంతో బాలుడిపై కుక్కలు దాడి చేస్తున్న భయానక దృశ్యాన్ని అతడి అక్క చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. వివరాలు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరం ఉన్న కటోల్ పట్టణంలోని ధంతోలి ప్రాంతంలో శనివారం ఉదయం.. ఐదేళ్ల బాలుడు విరాజ్ రాజు జయవర్, తన సోదరితో కలిసి వాక్‌కు వెళ్లాడు.
ఆ సమయంలో కొన్ని వీధికుక్కలు అతడిపై దాడి చేశాయి. బాలుడు తప్పించుకునేందుకు యత్నించిన లాభం లేకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన అతడి సోదరి వాటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించింది. భయపడి పెద్దగా కేకలు వేసింది. అయితే కుక్కలు బాలుడిని సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఓ ప్రదేశానికి లాక్కెళ్లాయి. అక్కడ బాలుడిపై కుక్కలు తీవ్రంగా దాడి చేశాయి. ఈ విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు, అటుగా వెళ్తున్నవారు అక్కడి చేరుకన్నారు. తీవ్రంగా గాయపడి.. రక్తస్రావం అవుతున్న బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత.. వైద్యులు అతడు చనిపోయినట్టుగా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసినట్లు కటోల్ పోలీసుు తెలిపారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నట్టుగా చుట్టుపక్కల ప్రజలు తెలిపారు. వీధికుక్కల దాడిన మరణించిన విరాజ్ తండ్రి పేరు రాజు జయవర్. అతను వృత్తిరీత్యా రైతు.
