మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. కాగా.. మరో 35 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

మల్కాపూర్ నుంచి గుజరాత్ లోని సూరత్ కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 3.15 గంటలకు కొండైబారి ప్రాంతంలో అదుపు తప్పి 30 అడుగుల లోతు లోయలో పడిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.