మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు పొటెత్తడంతో ప్రజలు సర్వం కోల్పోగా.. ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడగా.. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారు . కానీ బాధ్యత గల మంత్రిగారు మాత్రం జనంపై నోరు పారేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ కొల్హాపూర్ జిల్లాలో పర్యటించారు.

పునరవాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులను పరామర్శించిన ఆయన.. ‘‘ శిరోలి రోడ్డు ప్రారంభం కాగానే మీకు సౌకర్యాలు కల్పిస్తామని... అప్పటి వరకు మాకు కనీస సౌకర్యాలు అందడం లేదని, అధికారులు స్పందించడం లేదని ఎవరికీ ఫిర్యాదు చేయొద్దన్నారు.

మాకిది కావాలని అభ్యర్ధించాలి కానీ గొడవ చేయొద్దు అని హుకుం జారీ చేశారు. ఆయన మాట్లాడుతుండగానే.. అక్కడి ప్రజలు ఆహారం, నీరు అందడం లేదని నినాదాలు చేయడంతో సహనం కోల్పోయిన చంద్రకాంత్.. ‘‘ నోరు మూసుకోండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ఫైరవుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆపన్న హస్తం అందించాల్సిన మంత్రిగారు జనాన్ని అడుక్కోవాలని చెప్పడం ఏంటంటూ మండిపడుతున్నారు.