మహాకుంభ్‌లో అఖాడాల క్రమశిక్షణ, భద్రత కోసం కోత్వాల్‌ నియమిస్తారు. వెండి కర్ర, ప్రత్యేక దుస్తులతో వీళ్ళని గుర్తుపట్టవచ్చు. చిన్న చిన్న కేసుల్లో కోత్వాల్‌లే శిక్ష విధిస్తారు, పెద్ద కేసుల్లో అఖాడా పంచ్‌లు తీర్పు చెప్తారు.

మహాకుంభ్ : విశ్వాసం, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక అయిన మహాకుంభ్ ప్రయాగరాజ్‌లో జరుగుతోంది. మహాకుంభ్‌కి లక్షలాది మంది తరలివస్తున్నారు. సాధువులు, సన్యాసులు, సాధ్వీలతో అఖాడాలు ఇప్పటికే తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. అఖాడాలు ధర్మ, సంస్కృతికి ప్రతీకలు మాత్రమే కాదు... స్థావరం లోపల, బయట క్రమశిక్షణ పాటించేలా కోత్వాల్‌ పర్యవేక్షణలో ఒక బృందం పనిచేస్తుంది. ప్రతి అఖాడాకి ఒక కోత్వాలి ఉంటుంది, దానికి అధిపతి కోత్వాల్‌.

కోత్వాల్‌ పని ఏమిటి?

మహాకుంభ్‌లో అఖాడాలు క్రమశిక్షణ పాటించేలా కోత్వాల్‌ని నియమిస్తారు. పెద్ద అఖాడాలు ఒక కోత్వాల్‌, నలుగురు సహాయక కోత్వాల్‌లని నియమిస్తే, చిన్న అఖాడాలు ఒక కోత్వాల్‌, ఇద్దరు సహాయకులని నియమిస్తాయి. కోత్వాల్‌ అనేది అఖాడాలకు సంబంధించిన గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన పదవి. అఖాడా క్రమశిక్షణ, భద్రత కోత్వాల్‌ ప్రధాన బాధ్యత. సాధువులు, సన్యాసుల కోసం నియమాలు పాటించేలా చూడటంతో పాటు బయటి వ్యక్తుల కార్యకలాపాలపైనా ఆయన నిఘా వేస్తారు. అఖాడాలలో ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘనలు జరగకుండా, మతపరమైన కార్యక్రమాలు సజావుగా సాగేలా కోత్వాల్‌ చూస్తారు.

కోత్వాల్‌ని ఎలా గుర్తుపడతారు?

కోత్వాల్‌ని వారి దుస్తులు, వస్తువుల ద్వారా గుర్తుపట్టవచ్చు. వెండి పిడి ఉన్న కర్ర వీళ్ళు ధరిస్తారు. కొందరు ఈటె లేదా కత్తి కూడా ధరిస్తారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరించే అధికారం కోత్వాల్‌కి ఉంటుంది. శిక్షలు కూడా విధిస్తారు. చిన్న చిన్న కేసుల్లో అక్కడికక్కడే శిక్ష విధిస్తారు. పెద్ద నేరాలు జరిగితే అఖాడా పంచ్‌లు సమావేశమై, కోత్వాల్‌తో కలిసి కేసు విచారణ జరిపి శిక్ష విధిస్తారు.

కోత్వాల్‌ పదవీకాలం ఎంత?

సాధారణంగా మహాకుంభ్‌ జరిగేంత వరకే కోత్వాల్‌ పదవీకాలం ఉంటుంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అఖాడాలు పదవీకాలం పొడిగించవచ్చు.