ప్రయాగరాజ్ కుంభమేళాలో యువతది కీలక పాాత్ర ... పోలీసుల సరికొత్త ప్రయోగం
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భక్తులు, పర్యాటకుల భద్రత కోసం పోలీసులు సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. యువతను భద్రతా కార్యకలాపాల్లో భాగస్వాములను చేసే ఆలోచనలో వున్నారు.
ప్రయాగరాజ్ : 2025 ఆరంభంలో అంటే వచ్చే జనవరి, పిబ్రవరిలో జరగనున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భక్తులు, పర్యాటకుల రక్షణను దృష్టిలో వుంచుకుని సరికొత్త రక్షణ చర్యలు చేపట్టారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు కమ్యూనిటీ పోలీసింగ్‌పై దృష్టి సారించారు. యువత, ప్రజలను భాగస్వాములను చేయడానికి సోషల్ మీడియా వంటి వేదికలను ఉపయోగిస్తున్నారు.
కుంభమేళా కోసం ప్రయాాగరాజ్ కు విచ్చేసే భక్తులు, పర్యాటకుల సురక్షితంగా తిరిగివెళ్ళేలా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. భారీ జనసందోహంతో కూడిన ఈ ఈవెంట్ కోసం ఏడు విభాగాలుగా భద్రతా ఏర్పాట్లు చేసారు. ఇందులో ఒకటి యువతను కూడా అవసరం మేరకు వాడుకోవడం. ఇలా భద్రతా కార్యకలాపాల్లో యువతను భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నారు.
చుట్టుపక్కల జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని యువతకు సూచించారు. ప్రయాగ్‌రాజ్ ప్రజలు, పోలీసులు కలిసి భద్రత బాధ్యతను పంచుకోవాలని కోరుతున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ద్వారా AI-ఎనేబుల్డ్ CCTV కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతారు. మేళా ప్రాంగణంలో 10 రకాల భద్రతా కార్యకలాపాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను, ముఖ్యంగా యువతను భాగస్వాములను చేస్తారు. యువత చురుగ్గా పాల్గొనడం ద్వారా నగరమంతటా భద్రత మరింత పటిష్టం అవుతుంది.
మహా కుంభమేళా నిర్వహణలో యువత కీలక పాత్ర పోషిస్తుందని మహాకుంభ్ ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది అన్నారు. "యువత వాలంటీర్లుగా పనిచేస్తారు. డిజిటల్ మీడియా ద్వారా ఈవెంట్‌ను ప్రచారం చేస్తారు. యాత్రికులు, పర్యాటకుల రాకపోకల నిర్వహణలో పోలీసులకు సహాయం చేస్తారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం" అని ఆయన చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మత సంబరం అయిన మహాకుంభ్ భద్రతకు స్థానికుల సహకారం చాలా ముఖ్యం, ముఖ్యంగా జిల్లా అంతటా ఉన్న యువత సహకారం అవసరమని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో లేదా ఏ ప్రాంతంలోనైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనిస్తే యువత పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. భక్తులు, పర్యాటకుల భద్రత గురించి యువతలో అవగాహన కల్పిస్తున్నారు.
ఇక ఈ కుంభమేళా కార్యక్రమానికి పలు ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు కూడా పోలీసులకు సహకరిస్తున్నాయి. యువతను భద్రతా కార్యకలాపాల్లో భాగస్వాములను చేయడానికి సెమినార్లు, వీధి నాటకాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.