Asianet News TeluguAsianet News Telugu

ఒకప్పుడు జ్యూస్‌లు అమ్ముతూ జీవనం.. ఇప్పుడు 5 వేల కోట్ల ఆస్తులు, పెళ్లి కోసమే అక్షరాలా 200 కోట్లు.. ఎవరీ సౌరభ్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి సౌరభ్ చంద్రకర్ కీలక సూత్రధారిగా ఈడీ అనుమానిస్తోంది.  ఇతను తన వివాహాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నాడు. ఇందుకోసం అక్షరాలా రూ.200 కోట్లు ఖర్చు చేశాడు. 

Mahadev gambling app : Sourabh Chandrakar spent Rs 200 cr on lavish wedding in uae ksp
Author
First Published Sep 16, 2023, 9:16 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నిర్వహించిన దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో దాదాపు రూ.417 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాయ్‌పూర్, భోపాల్, కోల్‌కతా, ముంబై సహా దేశంలోని పలు నగరాల్లో బెట్టింగ్ సిండికేట్‌కు చెందిన 39 కార్యాలయాలపై ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా 15 మందిని అదుపులోకి తీసుకుంది. 

ఈ స్కాం మొత్తానికి సౌరభ్ చంద్రకర్ కీలక సూత్రధారిగా ఈడీ అనుమానిస్తోంది. ఇతను దుబాయ్‌లో వుంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నట్లుగా దర్యాప్తులో తేలింది. పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్‌లు, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఇతర ఆటల ద్వారా మహాదేవ్ బుక్ యాప్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఈ యాప్‌లో కో ప్రమోటర్‌గా వున్న రవి ఉప్పల్‌తో కలిసి బెట్టింగ్ ద్వారా వచ్చిన సొత్తును ఎఫ్‌పీఐ మార్గం ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడి పెట్టారు. తద్వారా దుబాయ్‌లో ఈ ఇద్దరు ప్రమోటర్లు దాదాపు రూ.5000 కోట్ల వరకు ఆర్జించినట్లుగా తేలింది. 

ఇకపోతే.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సౌరబ్ దుబాయ్‌లో తన వివాహాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నాడు. ఇందుకోసం అక్షరాలా రూ.200 కోట్లు ఖర్చు చేశాడు. నాగ్‌పూర్ నుంచి తన బంధుమిత్రులు, సినీ ప్రముఖులను స్పెషల్ జెట్‌ల ద్వారా దుబాయ్‌కి రప్పించాడు. ఒక్క వెడ్డింగ్ ప్లానర్‌కే రూ.120 కోట్లు చెల్లించాడు. ముంబైలోని మలాద్‌లో వున్న ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అంగడియ సంస్థలు డబ్బును అందజేసినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది.

ఈ విధంగా యోగేష్ భాపట్ కంపెనీ ఆర్ 1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.112 కోట్లు, హోటల్ బుకింగ్స్ నిమిత్తం రూ.42 కోట్లు అందినట్లుగా తెలుస్తోంది. అలాగే సౌరభ్ వివాహం నిమిత్తం భోపాల్‌కు చెందిన ర్యాపిడ్ ట్రావెల్స్.. అతని బంధువులు, సినీ తారలను దుబాయ్‌కి పంపడానికి ఏర్పాట్లు చేసిందని తేలింది. కోల్‌కతాకు చెందిన వికాస్ చప్పరియా అనే వ్యక్తి ద్వారా అక్రమ మార్గంలో నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అభియోగాలు నమోదు చేసింది. 

సౌరభ్ వివాహానికి హాజరైన బాలీవుడ్ నటులకు సమన్లు జారీ చేసి వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని ఈడీ భావిస్తోంది. అలాగే గతేడాది సెప్టెంబర్ 18న జరిగిన ఓ పార్టీకి కూడా బాలీవుడ్ తారలు హాజరయ్యారు. ఈవెంట్ మేనేజర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హవాలా వ్యాపారులపై జరిపిన దాడుల్లో వీరంతా మహదేవ్ ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ యాప్ గొడుగు కింద సిండికేట్ అయినట్లుగా ఈడీ నిర్ధారించింది. ఇన్‌యాక్టివ్, సెమీ యాక్టీవ్ మోడ్‌లో వున్న బ్యాంక్ ఖాతాలను గుర్తించి.. అవసరమైతే వారికి డబ్బు ఆశ చూపి ఈ ఖాతాల ద్వారా ఈ గ్యాంగ్ కోట్ల రూపాయలు లావాదేవీలు చేసినట్లు ఈడీ తెలిపింది. 

ఇంతకీ ఎవరీ చంద్రకర్ :

వేల కోట్ల అవినీతి సామాజ్రాన్ని సృష్టించిన సౌరభ్ చంద్రకర్ గత చరిత్ర తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఇతను ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన వ్యక్తి. బతుకుదెరువు కోసం తొలుత ఇతను జ్యూస్‌లు అమ్మేవాడు. రవి ఉప్పల్ ఇంజనీరింగ్ చదివాడు. వీరిద్దరూ స్థానికంగా బుకీలుగా వ్యవహరించేవారు.. ఆ తర్వాత 2018లో దుబాయ్‌కి మకాం మార్చి ఈ యాప్‌ను ప్రారంభించారు.

విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులకు డబ్బులు ఆశ చూపి తమ దందా కొనసాగించారు. ఇది సక్సెస్ కావడంతో అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. సెలబ్రెటీల ద్వారా భారీ ఎత్తున ప్రమోషన్స్  నిర్వహించి కోట్ల కూడబెట్టారు. అలా ఫెయిర్ ప్లే, రెడ్డి అన్నా, లోటస్ 365 వంటి బ్రాండ్‌ను కొనుగోలు చేశారు. మహదేవ్ యాప్ కేసులో ఆధారాలు దొరకడంతో చంద్రకర్, రవిలపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios