తమిళనాడు మదురైలోని మస్తాన్‌పట్టి టోల్ ప్లాజాలో ఆదివారం తెల్లవారుజామున ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మరణించాడు.
చెన్నై: తమిళనాడు మదురైలోని మస్తాన్‌పట్టి టోల్ ప్లాజాలో ఆదివారం తెల్లవారుజామున ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడిని సతీష్ కుమార్‌గా గుర్తించారు. అతడు మదురై జిల్లాలోని సఖిమంగళంకు చెందిన వ్యక్తి. అయితే బ్రేకు ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. టోల్ బూత్ వద్ద సతీష్ కుమార్ లారీని ఆపడానికి ప్రయత్నించగా.. అది అతనిని ఢీకొట్టి కొన్ని మీటర్ల ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. టోల్ ప్లాజా వద్ద ఎదురుగా ఒక కారును కూడా ఢీకొట్టింది.
‘‘లారీ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి కేరళకు 30 టన్నుల బియ్యాన్ని తీసుకెళ్తుంది. ఏపీలోని గుంటూరుకు చెందిన కె బాలకృష్ణన్ (41) లారీ డ్రైవర్‌గా ఉన్నాడు. బండికోయిల్ సమీపంలో వంతెన దాటిన కొద్దిసేపటికే బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి లారీని ఆపే ప్రయత్నం చేయాలని డ్రైవర్ భావించగా.. రోడ్డు పక్కనే రెస్టారెంట్లు ఉండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. లారీ టోల్ బూత్ దగ్గరికి చేరుకునే సరికి కొన్ని వాహనాలు వరుసలో ఉండడం చూసిన డ్రైవర్.. వాటిని ఢీకొట్టకుండా ఉండేందుకు లారీని రాంగ్ రూట్‌లో మళ్లించాలని నిర్ణయించుకున్నాడు.
రాంగ్ రూట్‌లో వస్తున్న సతీష్ కుమార్ ఆపడానికి ప్రయత్నించారు. అయితే లారీ అతడిని ఢీకొట్టి ఈడ్చుకుంటూ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. మొత్తంగా ఈఘటన సతీష్ మృతిచెందడంతో పాటు కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు, ఒక మహిళా టోల్ బూత్ ఉద్యోగిని కూడా గాయపడ్డారు’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
