మదర్సాల్లో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ బోధించాల్సిన అవసరం ఉన్నదని ఢిల్లీలోని హమ్‌దర్ద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అహ్మద్ నయీమి అన్నారు. మదర్సా సిలబస్‌లోనూ మార్పు రావాలని, అనవసర విషయాలను తొలగించాలని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ: మదర్సాల్లో మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తూ విద్యార్థులను ఆధునిక విద్య వైపు ప్రేరేపించే డాక్టర్ మొహమ్మద్ అహ్మద్ నయీమి మదర్సా విద్యలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడారు. ఢిల్లీలోని హమ్‌దర్ద్ యూనివర్సిటీలో థియాలజీ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ మొహమ్మద్ అహ్మద్ నయీమి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

భారత్‌లో ఇస్లాం పాఠశాలల చరిత్ర ఏమిటీ?

భారత్‌లో మదర్సాలకు ఘనమైన చరిత్ర ఉన్నది. జనబాహుళ్యంలోకి విజ్ఞానాన్ని తీసుకెళ్లడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. స్కూల్ సిస్టమ్ ఇక్కడ బ్రిటీష్‌వారు ప్రవేశపెట్టారు. కానీ, వాటికి ముందు అధ్యయనాలకు మదర్సాలు కేంద్రంగా ఉన్నాయి. రిలీజియస్ స్టడీస్‌తోపాటు ఆధునిక అంశాలనూ అక్కడ బోధించేవారు. అన్ని మతాలవారూ మదర్సాల నుంచి విద్యను అందిపుచ్చుకునేవారు. 

మదర్సాల నుంచి డిగ్రీ పొందినవారిని జామియా ఉలామ్ అని పిలిచేవారు. వారికి అన్ని సైన్సుల్లో అవగాహన ఉండేది. ఎందుకంటే.. మదర్సాల్లో ఖురాన్, హడిత్, ఫిక్, అరబిక్ భాషలతోపాటు మెడికల్ సైన్స్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, మ్యాథ్స్, ఫిలాసఫీ, తర్కం కూడా నేర్పేవారు. 

మదర్సాల ఆధునికీకరణ, ఇతర మార్పుల గురించి చర్చ జరుగుతున్నది. మీరేమంటారు?

మదర్సాల్లోని సిలబస్‌ను చూస్తే అది నేటి ఆధునిక అవసరాలకు సరిపపోదని, మార్పులు తప్పక అవసరమనే విషయం అవగతమవుతుంది. మదర్సాలతో దగ్గరి సంబంధం ఉన్నది. తరుచూ నేను వాటిని సందర్శిస్తాను. విద్యార్థులను మోటివేట్ చేస్తూ ఉంటాను. మదర్సాల్లో చదివిన తర్వాత జీవితాలు తప్పక మెరుగుపడతాయని వారికి చెబుతుంటాను. విద్యలోనూ వారు రాణించగలుగుతారు. వీటితోపాటు మదర్సా డిగ్రీ పొందిన తర్వాత కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎలా అడ్మిషన్ పొందాలో కూడా చెబుతాను.

ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచుకుంటే అది వారి విద్యార్జనకు, అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరిస్తాను. అదృష్టవశాత్తు ఈ విషయాలను మదర్సా విద్యార్థులు అంగీకరిస్తున్నారు. అందుకే మదర్సాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు యూనివర్సిటీల వైపు మళ్లుతున్నారు. మదర్సాల్లో మార్పుల గురించి మాట్లాడితే.. అధికారులకూ మార్చాలని ఉన్నది. వారు కూడా మార్పులు తెస్తున్నారు. ఇది జరిగితే అక్కడ చేరే విద్యార్థుల భవిత బాగుంటుంది.

విద్యను ఉపాధి వరకు చేర్చడంలో మదర్సాల ఆధునికీకరణ చాలా ముఖ్యం. ఇది సరైన అంచనేనా?

ఇది చాలా మంచి విషయం. ఇస్లాం ఇతర విషయాలను నొక్కి చెబుతున్నా.. మనిషి కచ్చితంగా స్వయం సమృద్ధుడై ఉండాలనీ బోధిస్తుంది. అతను స్వతహాగా జీవించగలగాలని చెబుతుంది. అలాంటప్పుడే ఆ వ్యక్తి దేశానికి, జాతికి, మానవాళికి సేవ చేయగలడు. మదర్సా విద్యతో సంబంధమున్నవాళ్లూ మతపరమైన విద్యతోపాటు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అవసరమన్న ఆలోచనలు చేస్తున్నారు. దీని ద్వారా ఉపాధి సమస్య తీరుతుంది. ఈ దిశగా మదర్సాలు అడుగులు వేస్తున్నాయి. విద్యార్థుల్లోనూ అవగాహన పెరుగుతున్నది. వారు ప్రొఫెషనల్ స్టడీస్, డిప్లమాలు, ఇతర కోర్సులు చదువుతున్నారు. చాలా మంది విద్యార్థులు హాస్పిటల్స్, ఏజెన్సీల్లో పనులు చేస్తున్నారు.

ఒక వేళ విద్యార్థులు రెగ్యులర్ ఇన్‌స్టిట్యూషన్‌లలో ఉన్నత విద్యలు చదవాలని భావిస్తే... రిలీజియస్ ఎడ్యుకేషన్‌తోపాటు రెగ్యులర్ హై స్కూల్, గ్రాడ్యుయేషన్ కూడా విద్యార్థులు చదివేలా మదర్సాలను విద్యను ఎందుకు మార్చవద్దు?

ఔను! ఇది చాలా స్కూల్‌లలో అమల్లో ఉన్నది. చాలా మదర్సాలు బ్యాచిలర్ డిగ్రీలు, లేదా బీఏ సమాన డిగ్రీలు అందిస్తున్నాయి. తమిళనాడు, కేరళలో అలాంటి మదర్సాలు చాలా ఉన్నాయి. ఇతర మదర్సాలు అన్నీ కూడా ఈ రెండు దక్షిణ రాష్ట్రాల్లోని మదర్సాలను అనుసరించి సబ్జెక్టులు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే, ఆ సిలబస్ థియాలజీతో ట్యాంపరింగ్ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే, కాలం చెల్లిన విషయాలను తొలగించాలి. అలాగే, మదర్సాల్లో స్టడీ టైమ్‌ను పెంచాలి.