చెన్నై: రాష్ట్రంలో ఉచిత బియ్యం కేవలం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని తమిళనాడులోని మద్రాస్‌హైకోర్టు అభిప్రాయపడింది. అన్ని వర్గాల ప్రజలకు ఇలా ఉచిత బియ్యం ఇస్తుంటే సోమరులుగా తయారవుతున్నారని పేర్కొంది. 

పేదలకు అవసరం ఉన్న వారికి మాత్రమే బియ్యం, సరుకులు ఉచితంగా ఇవ్వాలని, కానీ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాలు అన్ని వర్గాల వారికి, ఆర్థికంగా ఉన్న వారికి కూడా ఉచితంగా ఇస్తున్నారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

దీంతో అన్నీ ప్రభుత్వం నుంచి ఉచితంగా వస్తే బాగుండు అని ప్రజలు ఆశిస్తున్నారని అభిప్రాయపడింది. ఇలా అన్ని వర్గాల వారికి ఆర్థికంగా ఉన్నవారికి ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులుగా మారుతున్నారని పేర్కొంది.

ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్న వ్యక్తి అరెస్ట్‌కు సంబంధించి కేసు విచారణ నేపథ్యంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ రేషన్‌ బియ్యం ఇస్తున్నారని 2017-18 సంవత్సరంలో ప్రభుత్వం ఉచిత బియ్యంపై రూ.2,110కోట్లు వెచ్చించిందని తెలిపింది. 

ఈ బియ్యాన్ని దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి మాత్రమే అందించేలా సదరు పథకంలో మార్పులు చేయడంపై ప్రభుత్వ సూచనలు తీసుకోవాలని అడ్వొకేట్‌‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ను అడిగింది.

దారిద్ర్య రేఖ దిగువ ఉన్న కుటుంబాల గురించి ఏదైనా సర్వే చేశారా అని కోర్టు ప్రశ్నించింది. ఒకవేళ చేసి ఉంటే అలాంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, వారికి ఎంత బియ్యం ఇవ్వాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియజేయాలని ఆదేశించింది. 

బియ్యం పంపిణీకి కోర్టు వ్యతిరేకం కాదని కానీ అవి అర్హులకు మాత్రమే అందాలని తమ అభిప్రాయమని తెలిపింది. ఈ విషయానికి సంబంధించి గత పదేళ్లలోని వార్షిక నివేదికలను కోర్టుకు అందజేయాలని తమిళనాడు పౌర సరఫరాల కార్పొరేషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 30కి వాయిదా వేసింది.