ప్రేమ వివాహం చేసుకుని సంచలనం రేకిత్తించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ప్రేమ వివాహం చెల్లుతుందని మద్రాస్ హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.

ఇద్దరూ మేజర్లే కాబట్లి వివాహానికి అభ్యంతరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, ఈ నెల 5న అన్నా డీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారి పెళ్లి చెల్లదంటూ యువతి తండ్రి కోర్టుకెక్కారు.

ఎమ్మెల్యే ప్రభు తమ కుమార్తెని కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తూ.. సౌందర్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను అప్పగించాలంటూ మద్రాస్‌ హై కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అతని పిల్‌ను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. 

ఈ వివాహం బెదిరింపుల మధ్య జరిగినట్టు, తన కుమార్తెను కిడ్నాప్‌ చేసినట్టు సౌందర్య తండ్రి స్వామినాథన్‌ ఆరోపించారు. అయితే తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని, ఇందులో ఎలాంటి బెదిరింపులు, కిడ్నాప్‌లు లేవు అని స్వామినాథన్ కుమార్తె సౌందర్య ప్రకటించింది. 

అయినా స్వామినాథన్ పట్టువదలలేదు. తన కుమార్తెను బలవంతంగా వివాహం చేసుకున్నారని, రక్షించాలని కోరుతూ స్వామినాథన్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది.  పిటిషనర్‌ వాదనను విన్న కోర్టు, సౌందర్యను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.  

కోర్టు ఆదేశాలపై ఎమ్మెల్యే ప్రభు స్పందించారు. భార్యను కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమేనని, శుక్రవారం కోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. తన మామతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ ఆయన పట్టువదలడం లేదన్నారు.

తామిద్దరం ప్రేమించుకున్నామని, ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నామని, దీనిని ఆయన రాద్ధాంతం చేయడం విచారకరంగా పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల్ని శిరసావహిస్తానని, భార్యను కోర్టులో హాజరు పరుస్తానని పేర్కొన్నారు.   

త‌మిళ‌నాడులో అధికార అన్నాడీంకే ఎమ్మెల్యే ప్ర‌భు (35) ర‌హ‌స్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విల్లుపురం జిల్లాలోని తియ‌గ‌దురుగ‌మ్ ప‌ట్టణానికి చెందిన ప్ర‌భు అదే ప‌ట్ట‌ణానికి చెందిన సౌంద‌ర్య (19) గ‌త నాలుగేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.

అయితే సౌంద‌ర్య తండ్రి స్వామినాథ‌న్ (48), ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు‌ వారి ప్రేమ‌ను అంగీక‌రించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బీఏ సెకండియ‌ర్ విద్యార్థిని అయిన‌ సౌంద‌ర్య‌ ఆదివారం ఉద‌యం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిపోయింది.