పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితాంతం ఒకరికి మరొకరు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లిళ్లు జరిపిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరికి మరొకరు అండగా ఉండాలని చెబుతారు. అయితే.. ఈ పెళ్లి పేరిట కొందరు అమాయక యువతులను అతి దారుణంగా మోసం చేస్తున్నారని తాజాగా వెలుగుచూసింది. నేరాలు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్నవారు కూడా.. ఆ విషయాన్ని దాచిపెట్టి బెయిల్ పై బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే మళ్లీ జైలుకు వెళ్లిపోతున్నారు.

భర్త మళ్లీ జైలుకి వెళితే తప్ప.. తాము మోసపోయామని సదరు యువతులు తెలుసుకోలేపోతున్నారు. దీంతో.. భర్త ఎప్పుడు బయటకు వస్తాడా అని ఆశగా ఎదరుచూస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా.. తాజాగా ఓ యువతి ఇలా కోర్టులో భర్తకు పెరోల్ మంజూరు చేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా.. ఆమె విషయంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

పెళ్లి చేసుకునేటప్పు తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అనే విషయం తెలియదని ఆమె చెప్పింది. ఒక హత్య కేసులో కింది కోర్టు భర్తకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాలు చేసి జామీనుపై బయటకు వచ్చిన సమయంలో తనను పెళ్లిచేసుకున్నాడని పేర్కొంది. దీంతో న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపోయారు.

ఇలాంటి కేసులు చాలానే దాఖలయ్యాయని న్యాయమూర్తుల దృష్టికి వచ్చింది. గతంలో అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పెరోల్‌ మంజూరు చేసేలా జైళ్ల శాఖను ఆదేశించాలని కోరుతూ అతడి భార్య అడ్‌కొనర్వ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మహిళ తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అని తెలిసే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లుగా జైల్లో ఉంటున్న భర్తను పెరోల్‌పై విడుదల చేయాల్సిందిగా కోరింది. 

పదేళ్లకు ముందు ఒక్కరోజు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినపుడు పెళ్లి చేసుకున్నాడని, అదే రోజు రాత్రి జైలుకు వెళ్లిపోవడంతో అత్తగారితోపాటూ ఉంటు న్నట్లు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెళ్లి చేసుకునే వారు అనేక వివరాలను సేకరిస్తున్నారని, ఒక ఖైదీని, అందునా యావజ్జీవ ఖైదీని వివాహమాడేందుకు ఏ యువతీ అంగీకరించదన్నారు. యువతుల అభీష్టం మేరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయా? లేక బలవంతంగా చేస్తున్నారా అన్న దానిపై విచారణ చేయాలని మహిళా కమిషన్ ని ఆదేశించారు.