భోపాల్: సాధారణంగా ఎన్నికలంటే తమకు రోడ్డు కావాలి, నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇళ్లు కావాలి, వంతెనలు కావాలని అడగడం చూశాం. కానీ ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం తమ ఓటు కావాలంటే తమ గ్రామాల్లోకి వచ్చి భీభత్సం సృష్టిస్తున్న కోతులను తరమాల్సిందేనని కండీషన్ పెడుతున్నారట అక్కడి ఓటర్లు. ఇంతకీ ఈ కోతుల గోల ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఓసారి మధ్యప్రదేశ్ వెళ్లాల్సిందే. 

మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను ఏళ్ల తరబడి కోతలు సమస్య వేధిస్తుంది. కోతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు అడుగు వెయ్యాలంటే చాలు భయపడిపోతున్నారు. ఒకవేళ సాహసించి బయటకు అడుగువేస్తే చాలు ఎగడబతాయని వారు వాపోతున్నారు. 

బయటకు వస్తే కోతలన్నీ వచ్చి దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోకి చొరబడి సర్వనాశనం చేస్తున్నాయని అభ్యర్థుల ముందు ఏకరువు పెట్టుకుంటున్నారు. ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఎన్నికల సందర్భంగా తమ ప్రతాపం చూపిస్తున్నారు. 

ఎన్నికలనే అస్త్రంగా వాడుకుంటున్నారు. ఓటు కోసం వచ్చే అభ్యర్థులకు కోతి కండీషన్స్ పెడుతున్నారు. ఓటు వెయ్యాలంటే కోతులను తరమాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే తమను ఓట్లు అడగొద్దంటూ నేతలకు ఖరాఖండిగా చెబుతున్నారు. 

అయితే ఓటుకోసం వచ్చిన ప్రతీ అభ్యర్థి తరిమేస్తాం అని హామీలు మాత్రం ఇస్తున్నారు. మరి వీళ్ల డిమాండ్ ను గెలిచిన తర్వాత నెరవేరుస్తారా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.