భోపాల్: మధ్యప్రదేశ్ లో అనిశ్చితి కొనసాగుతుంది. నేడు బలపరీక్ష జరపాలని గవర్నర్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ను ఆదేశించారు. నేటి ఉదయం సభ ప్రారంభమైనప్పటికీ... నేడు బల పరీక్షను వాయిదా వేయడానికి కాంగ్రెస్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. 

ఎప్పుడు బలపరీక్ష నిర్వహించినా తాము గెలుస్తామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ వారి వద్ద బల నిరూపణకు అవసరమైన నంబర్లు లేవు. నేడు బడ్జెట్ సమావేశాల తొలిరోజు కావడంతో గవర్నర్ ప్రసంగం ఉండనుంది. స్పీకర్ ని బలపరీక్ష నిర్వహించమని ఆదేశించినప్పటికీ ఆయన మాత్రం దానిపైన ముందుకు వెళ్లేలా కనబడడం లేదు. 

గవర్నర్ ప్రసంగించినతరువాత ముఖ్యమంత్రి కమల్ నాథ్ ని చట్టప్రకారంగా నడుచుకోవాలని కోరారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సదన్ కా ఆదర్ కారో అని అరిచారు. దాని అర్థం, వారు సభను నడిపే పూర్తి అధికారాలను స్పీకర్ కలిగి ఉన్నారనేది, ఆయన సభను నడపనివ్వాలనేది వారు కోరిన అంశం.  

గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీజేపీ, కాంగ్రెస్ నేతలు నినాదాలు చేయడం ఆరంభించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ 26వతేది వరకు అసెంబ్లీని వాయిదా వేశారు. 

బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లకుండా లోపలే బైఠాయించి నినాదాలను చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి జిందాబాద్ కమల్ నాథ్ అంటూ నినాదాలు చేసారు. 

22 మంది రెబెల్ ఎమ్మెల్యేలలో కేవలం 6గురి రాజీనామాను మాత్రమే ఆమోదించారు. మిగిలిన సభ్యుల రాజీనామాలను ఆమోదించాలంటే వారిని ప్రత్యక్షంగా కలవాలని, వారిని రాజీనామా ఏ పరిస్థితుల్లో చేసారో తెలుసుకోవాలని అంటున్నారు. అందుకు సంబంధించి రెబెల్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే రెండవసారి హాజరు కమ్మని వర్తమానం పంపారు. 

ఇలా ఒకటి రెండు రోజులు సమయం దొరికితే ఆ లోపల ఆ రెబెల్ ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకోవచ్చని వారు భావిస్తున్నారు. వాస్తవానికి ఆ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకలో ఉన్నారు. వారు భోపాల్ కి వస్తే ఒక్క ఛాన్స్ దొరికినా తిప్పుకోవచ్చని కమల్ నాథ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక పోతే జ్యోతిరాదిత్య సింధియాకు సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా బయటకు వెళ్లిన తరువాత వారు ఆరోజు నుండి బెంగళూరులో ఉన్నారు.