మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదం తెలిపింది.

డిసెంబర్‌లో ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌కు చట్టరూపు ఇచ్చింది. ‘మధ్య ప్రదేశ్ మతస్వేచ్ఛ బిల్లు- 2021’ పేరుతో ఈ నెల 1న రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.

దీనిపై చర్చ ముగిసిన అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ చట్టం ప్రకారం నిబంధలు ఉల్లంఘించిన వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా సైతం విధిస్తారు.

కాగా మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఈ తరహా 23 కేసులు నమోదైనట్టు గత నెలలో హోంమంత్రి వెల్లడించారు.