సెల్ఫీ సరదా... ఓ తల్లికూతుళ్ల ప్రాణాలు తీసింది. వరద కాలువ పక్కన సెల్ఫీ తీసుకోబోయి ప్రమాదవశాత్తు అందులో పడి తల్లీ కూతుళ్లు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం మండ్ సౌర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆర్డీ గుప్తా అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ స్థానిక ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 7గంటల 30 నిమిషాలకు ఆయన తన ఇంటి సమీపంలోని వరద కాలువను చూడటానికి కుంటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.

ఆ సమయంలో కాలువ మీద ఉన్న కల్వర్ట్ పై నిల్చొని ఆయన భార్య, కుమార్తె సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో కాలువలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతోపాటు.. వారు నిల్చున్న కల్వర్టు కూలింది. దీంతో... గుప్తా భార్య బిందు గుప్తా(48), కుమార్తె ఆశ్రిత(22) వరద నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే కాపాడేందుకు ప్రయత్నించినా... ఫలితం దక్కలేదు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 39మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు.