మధ్యప్రదేశ్ లో మహిళల మీద రోజురోజుకూ హత్యాచారాలు, హింస పెరుగిపోతున్నాయి.  రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మహిళ, ఓ బాలిక మీద అత్యాచారం, హత్య జరిగాయి. మొదటి కేసులో మధ్యప్రదేశ్ లోని సిద్ధి జిల్లాలో శనివారం అర్థరాత్రి ఒక మహిళపై ముగ్గురు పురుషులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత రాడ్లతో హింసించారు. ఇది 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులాగే ఉంది.

ఇది జరిగిన 36 గంటల్లోనే అదే రాష్ట్రంలోని మరో మూల ఓ బాలికను అత్యాచారం చేసి చంపేశారు. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో జరిగింది. అత్యాచారం చేసి నేరం బైటికి పొక్కుతుందని ఆ బాలికనుగొంతు కోసి చంపారు.

మొదటి అత్యాచారం భోపాల్ నుండి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమిలియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో బాధితురాలు టీ షాపు నడుపుకునే ఓ 45 యేళ్ల  ఒంటరి మహిళ. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఘటన జరిగిన రోజు ఆ మహిళ తన గుడిసెలో నిద్రిస్తుండగా నిందితులు తలుపుతట్టారు. తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. అదే సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు.. ఆమె ఒంటరి అనే విషయం గమనించి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా ఆమెపై రాడ్లతో దాడి చేశారు. ఆ మహిళ భర్త నాలుగేళ్ల క్రితం మరణించడంతో ఒంటరిగానే జీవిస్తోంది. వారు ఆమెను వదిలి వెళ్లగానే వెంటనే ఆ మహిళ మొదట జిల్లా ఆసుపత్రికి, తరువాత రేవాలోని సంజయ్ గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

"ఆసుపత్రి వైద్యులు ఆమెకు ప్రమాదం లేదని, అయితే కోలుకోవడానికి వారానికి పైగా సమయం పట్టవచ్చని చెప్పారు. ఈ విషయంలో నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసును సిధి సూపరింటెండెంట్ పంకజ్ కుమావత్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది" అని ఇన్స్పెక్టర్ జనరల్ ఉమేష్ జోహా అన్నారు.

రెండవ కేసులో ఓ పదమూడేళ్ల స్కూల్ విద్యార్థినిని స్థానికంగా ఉండే ఓ షాపు యజమాని అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇది సోమవారం ఉదయం ఖాండ్వా జిల్లాలోని జమానియా గ్రామంలో జరిగింది. ఆ బాలిక తొమ్మిదో తరగతి విద్యార్థి, ఇంటికి దగ్గర్లోని కిరాణా దుకాణంలో బిస్కెట్లు కొనుక్కోవడానికి వెళ్ళింది.

కిరాణా షాపు యజమాని ఎవ్వరూ లేనిది చూసి ఆ అమ్మయిని ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత నేరం బైటికి వస్తుందని ఆమె గొంతు కోసి చంపాడు. బాలిక మృతదేహన్ని భార్యతో కలిసి ఒక సంచిలో కుక్కి అటక మీద దాచి పెట్టాడు. 

ఇది గమనించిన ఇంటి పక్కవాళ్లు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు వెళ్లి చూసేసరికే అమ్మాయి విగతజీవిగా కనిపించింది. దీంతో వారు వెంటనే ఖండ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరాణా వ్యాపారి, అతనికి సహకరించిన భార్య ఇద్దరూ పరారీలో ఉన్నారు.