షూలోకి కట్ల పాము దూరింది. ఆ విషయాన్ని గమనించకుండా ఓ ఎస్పీ ఆ షూస్ వేసుకున్నాడు. ఇంకేముంది.. ఆ పాము కాస్త ఎస్పీని కాటు వేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. అప్రమత్తమైన స్థానికులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో.. ప్రాణాపయం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

పన్నా జిల్లాకి చెందిన ఎస్పీ మయాంక్ అవస్తి.. ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఆయన షూ వేసుకోగా.. లోపల ఏదో మెత్తగా తగిలింది. వెంటనే కాలు బయటకు తీసి చూద్దాం అనుకునేలోపు.. పాము అతని కాలి వేలిమీద కాటు వేసింది. దీంతో.. చూసేసరికి అందులో పాము కనిపించింది. ఆయన భయంతో వణికిపోగా.. కుటుంబసభ్యులు, స్థానికులు ఆయనను వెంటనే చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆయన జబల్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అవస్తి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. పామును సురక్షితంగా పట్టుకెళ్లి సమీప అడవుల్లో విడిచిపెట్టామన్నారు. కాగా ఎస్పీ షూలో పాము దూరిన దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉందనీ.. బూట్లు, దుస్తులు ధరించే ముందు తప్పకుండా చెక్ చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.