అఖిలేష్ యాదవ్ నేటి ఔరంగజేబు అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. ఔరంగజేబు తన తండ్రి షా జహాన్‌ను నిర్బంధించారని పేర్కొన్నారు. అలాగే, ములాయం సింగ్ యాదవ్‌ను అఖిలేశ్ యాదవ్ దారుణంగా అవమానపరిచారని అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ములాయం సింగ్ యాదవే చెప్పారని వివరించారు. 

లక్నో: మధ్యప్రదేశ్(Madhya Pradesh) సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) పర్యటనలో ఉన్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై విమర్శలు కురిపించారు. అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) నేటి ఔరంగజేబు(Aurangzeb) అని ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆయన ఫ్లాప్ సినిమాల దర్శకుడు అని అన్నారు. రాంపూర్ కర్ఖానా అసెంబ్లీ నియోజకవర్గంలో క్యాంపెయిన్ కోసం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ మాట్లాడుతూ, అఖిలేశ్ యాదవ్ నేటి ఔరంగజేబు. ఆ మనిషి తన తండ్రితోనే విశ్వసనీయంగా లేడు. ప్రజలతో ఎలా విశ్వసనీయంగా ఉంటాడు? ఈ విషయాన్ని నేను అనడం లేదు. ములాయం సింగ్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. తన తండ్రితోనే విశ్వసనీయంగా లేని వ్యక్తి.. ఓటర్లకు ఎలా విశ్వసనీయంగా ఉండగలడని అన్నారని పేర్కొన్నారు. 

‘ఔరంగజేబు కూడా ఇదే విధంగా నడుచుకున్నాడు. ఔరంగజేబు తన తండ్రి షా జహాన్‌ను కారాగారంలో బంధించాడు. ఆయన తన సోదరులనూ చంపేశాడు. ములాయం సింగ్ ఏమంటున్నాడంటే.. అఖిలేశ్ యాదవ్ అవమానించినట్టుగా తనను ఇంకెవరూ అవమానించలేదు’ అని అన్నారు.

అదే సమయంలో అఖిలేశ్ యాదవ్ ఫ్లాప్ సినిమాల దర్శకుడు అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. ‘బాబా అఖిలేశ్ యాదవ్ చేపట్టిన కూటములు అన్నీ ఫ్లాపులే. అఖిలేశ్ యాదవ్ ఫ్లాప్ సినిమాల దర్శకుడు’ అని విమర్శించారు. అఖిలేశ్ యాదవ్ ఒక సారి రాహుల్ గాంధీతో చేతులు కలిపాడని, అప్పుడు ఆ రెండు పార్టీలు గాల్లో కొట్టుకుపోయాయని అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని, దానితో వారి ఫ్రెండ్షిప్ ముగిసిందని పేర్కొన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికలను ఉదహరిస్తూ.. అప్పుడు అఖిలేశ్ యాదవ్.. మాయావతితో కలిసి బరిలోకి దిగాడు. వారి జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని అనుకున్నారని, కానీ, ఫలితాలు వచ్చాయని, ఆ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు చూడలేదని చెప్పారు. ఆ ఫిలిం కూడా ఫ్లాప్ అయిందని విమర్శించారు.

ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ జయంత్ చౌదరీ చేతులు పట్టుకున్నారని, అఖిలేశ్ యాదవ్ ఎక్కడికి వెళ్లినా.. విధ్వంసం అనే శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషితో సమాజ్‌వాదీ పార్టీకి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ ఒక వంశమే నడిపిస్తున్నదని అన్నారు.

ఇదిలా ఉండగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలంతా అబద్ధాలు చెబుతున్నారని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి మంచి పని చేయలేద‌ని విమ‌ర్శించారు. ఈసారి బీజేపీ రాష్ట్రం మొత్తం నుంచి తుడిచిపెట్టుకుపోతుంద‌ని వ్యాఖ్య‌నించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అభివృద్ధి జరగలేదని పేర్కొంటూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మండిపడ్డారు. ఐదేళ్లు సీఎంగా ఉన్నా గోరఖ్‌పూర్‌లోని వైద్య కళాశాలలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించలేకపోయారనీ, గోరఖ్‌పూర్‌ను ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానం చేయలేకపోయారని విమ‌ర్శించారు. 

అలాగే, బీజేపీని రైతులు క్షమించరని అఖిలేష్ యాదవ్ అన్నారు. గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి పీజీఐకి వచ్చిన సౌకర్యాలు ఎందుకు ఇవ్వలేద‌ని ప్ర‌శ్నించారు. "బాబా ముఖ్యమంత్రి ఏ మంచి పని చేయలేదు. బాబా ముఖ్యమంత్రి తప్పుడు ప్ర‌చారం కొన‌సాగించారు. ఎక్క‌డో చైనాలో ఉన్న విమానాశ్రయం ఇక్క‌డిది అంటూ త‌ప్పుడు చిత్రాల‌తో ప్ర‌చారం చేశారు. ఈ పార్టీ అతి పెద్ద అబద్ధాలకోరు. వాళ్ల నాయకులంతా అబద్ధాలు చెబుతున్నారు" అని అఖిలేష్ యాద‌వ్ విమ‌ర్శించారు.