మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఆలయ పట్టణంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పండుగ సందర్భంగా భక్తులు 18.82 లక్షల  దీపాలు వెలిగించి.. కొత్త గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పారు. అయోధ్యలో గతంలో11.71 లక్షల మట్టి దీపాలు వెలిగించిన రికార్డును అధిగమించారు.

మహాశివరాత్రి పర్వదినం వేళ.. జ్యోతిర్లింగ 'మహాకాళ'ఉజ్జయిని నగరం లక్షలాది దీపపు కాంతులతో వెలుగులీనింది. మోక్షదాయిని శిప్రా నది ఒడ్డున సంధ్యా సమయంలో 18.82 లక్షల దీపాలను వెలిగించారు. ఏకకాలంలో ఇంత పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించడంతో కొత్త గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొంది.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మొత్తం 18,82,229 దీపాలను వెలిగించినట్లు సమాచారం. ఈ అద్భుతమైన , మరపురాని క్షణాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది తరలివచ్చారు.

శివజ్యోతి అర్పణం అని పేరు పెట్టే ఈ కార్యక్రమం జీరో వేస్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఇందులో ఉపయోగించిన ప్రతి మెటీరియల్‌ను మళ్లీ ఉపయోగించనున్నారు. శివజ్యోతి అర్పణం కార్యక్రమంలో భాగంగా నగరంలోని దేవాలయాలు, వాణిజ్య స్థలాలు, ఇళ్లలో షిప్రా నది ఒడ్డున ఆకర్షణీయంగా అలంకరించిన దీపాలను వెలిగిస్తారు.

ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు, స్థానిక పరిపాలన కేదారేశ్వర్ ఘాట్, సున్హారి ఘాట్, దత్ అఖారా ఘాట్, రామ్ ఘాట్ , భుఖి మాత ఆలయం వైపు ఘాట్ వద్ద దీపాలను వెలిగించడానికి బ్లాక్ వారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 9333 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాక్‌లో 225 దీపాలను ఉంచారు. దీపాలు వెలిగించేందుకు 20 వేల మంది వాలంటీర్లను నియమించినట్లు సమాచారం.

పౌరుల సంఘాల సహకారంతో స్థానిక యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక అధికారులు 21 లక్షల నూనె దీపాలు వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. 18.82 లక్షల దీపాలను వెలిగించగలిగారు.

Scroll to load tweet…

గత ఏడాది ఉజ్జయిని మహాశివరాత్రి నాడు ఏకకాలంలో 11 లక్షల 71 వేల దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించారు. గతేడాది ఏకంగా 15 లక్షల 76 వేల దీపాలు వెలిగించి అయోధ్య రికార్డును ఈ కార్యక్రమం బద్దలు కొట్టింది.