భోపాల్: మధ్యప్రదేశ్ లో జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కన్నకూతురిపై లైంగిక దాడి చేస్తున్న ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీముచ్ పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్ హెల్ప్ లైన్ సర్వీసుకు ఫోన్ చేసి చెప్పడంతో ఆ సంఘటన వెలుగు చూసింది. ప్రతి రోజు రాత్రి వ్యక్తి తాగి వచ్చి కూతురిని కొడుతూ ఉన్నాడని అతను చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు బాధితురాలి కోసం గాలింపు చేపట్టారని, రెండు రోజుల తర్వాత ఆమె తన నివాసంలో కనిపించిందని చీఫ్ పోలీసు సూపరింటిండెంట్ మోహన్ శుక్లా చెప్పారు. 

మూడేళ్ల క్రితం భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాలిక తండ్రితోనే ఉంటోంది. పని నుంచి తప్పతాగిన స్థితిలో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు. 

తన బాధను బాలిక చైల్డ్ కౌన్సెలర్ కు వివరించింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. ఆమె అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నిందితుడిని రమేష్ దేవరాగా గుర్తించాడు. కూలీ పని చేసి జీవనం సాగిస్తున్నాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.