ఏటీఎస్‌, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్  విభాగాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఉగ్రవాదులతో లింకులు వున్న 16 మందిని అరెస్ట్ చేసిన వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.

హైదరాబాద్, భోపాల్‌లలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏటీఎస్‌, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో 16 మందిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణల్లో సోదాలు జరిగాయన్నారు. ఉగ్రవాదులతో లింక్స్ వున్న 16 మందిని అరెస్ట్ చేశామని.. వీరు దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని నరోత్తమ్ మిశ్రా అన్నారు. షరియా చట్టాన్ని అమలు చేసేందుకు ఈ గ్రూప్ ప్లాన్ చేస్తోందని ఆయన తెలిపారు. 

ALso Read: ఉగ్రమూలాలపై హైద్రాబాద్‌‌లో ఏటీఎస్ సోదాలు: ఆ ఐదుగురు టెక్కీలు

మరోవైపు.. ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన వారిని పోలీసులు మధ్యప్రదేశ్‌కు తరలించనున్నారు . నిందితుల దగ్గరి నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, మారణాయుధాలను , ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా గడిచిన 18 నెలలుగా హైదరాబాద్‌లోనే మకాం వేసినట్లుగా తెలుస్తోంది. యువతను ఉగ్రవాదం, టెర్రరిజం వైపు మళ్లిస్తున్నారని నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. పట్టుబడిన వారంతా టెక్కీలేనని.. వీరికి హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు వున్నట్లు గుర్తించారు.