మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో అవాంతరాలు ఎదురౌతున్నాయి. ఉదయం సజావుగానే మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం సమయానికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ మందకోడిగా సాగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పోలింగే నిలిచిపోయింది.

సున్నిత ప్రాంతమైన భిండ్ జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. దీంతో.. అధికారులు పోలింగ్ ని నిలిపివేశారు. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఆ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఇవాళ ఉదయం నుంచే పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.బిండ్ జిల్లా అభ్యర్థులు అరవింద్ భండౌరియా (బీజేపీ), హేమంత్ కటారే (కాంగ్రెస్)లను గృహనిర్బంధంలో ఉంచారు.  కాగా ఈవీఎంలు మొరాయించడంపై మద్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ స్పందించారు. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయని కారణంగా ఓటర్లు క్యూలలో పడిగాపులు కాస్తున్నట్టు ఫిర్యాదులు అందాయన్నారు. అధికారులు సత్వరమే స్పందించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆయన ట్వీట్ చేశారు.