భోపాల్: మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ ప్రజాపతి 16 మంది కాంగ్రెసు తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. బెంగుళూరులో ఉన్న ఈ శాసనసభ్యులు తమ పదవులకు మార్చి 10వ తేదీన ఈమెయిల్ ద్వారా రాజీనామాలు సమర్పించారు. 

బెంగళూరులో ఉన్న ఎమ్మెల్యేల రాజీనామాలను తాను ఆమోదించానని, వారు బెంగళూరు నుంచి తిరిగి రావడానికి నిరాకరిస్తున్నారని ప్రజాపతి చెప్పారు. శుక్రవారం బలపరీక్షకు సిద్ధపడాలని ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన బలపరీక్షకు సిద్ధపడాల్సి ఉంది. 

సుప్రీంకోర్టు విధించిన గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈలోగానే కమల్ నాథ్ తన పదవికి రాజీనామా చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది. 22 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. వారిని వెనక్కి రప్పించుకోవడానికి కాంగ్రెసు విఫలప్రయత్నం చేసింది. ప్రస్తుతం 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ అంతకు ముందే మరో ఆరుగురి రాజీనామాలను ఆమోదించారు.

రాజీనామా చేయడానికి ముందు కమల్ నాథ్ మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మాట్లాడుతారు. ఆ తర్వాత తన రాజీనామాను గవర్నర్ కు సమర్పించే అవకాశం ఉంది. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి, నిర్బంధించారని కాంగ్రెసు నాయకులు ఆరోపించారు. 

తిరుగుబాటు శాసనసభ్యులు కాంగ్రెసు నేతల ఆరోపణలను ఖండించారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని, అందువల్ల తాము భోపాల్ కు రాలేమని వారు బెంగళూరులో చెప్పారు. ఆ మేరకు వీడియోలను కూడా విడుదల చేశారు. 

22 మంది శాసనసభ్యుల రాజీనామాతో శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 206కు పడిపోయింది. కాంగ్రెసు పార్టీకి 92 మంది సభ్యుల బలం ఉంది. సాధారణ మెజారిటీకీ 104 మంది సభ్యుల మద్దతు అవసరం. కాంగ్రెసుకు ఐదుగురు సభ్యులు తక్కువ పడుతున్నారు ప్రతిపక్ష బిజెపికి 107 మంది సభ్యుల బలం ఉంది. కమల్ నాథ్ రాజీనామా తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంది.