మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ కరోనా బారినపడ్డారు . తేలికపాటి లక్షణాలు ఉన్నందున ఆయన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో అన్ని పనులను వర్చువల్‌గా చేస్తానని... రేపు, సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమంలో కూడా తాను వర్చువల్‌‌గా పాల్గొంటానని శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. పలువురు ప్రముఖులు మాత్రం వైరస్ బారినపడుతూనే వున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలు ఉన్నందున ఆయన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో అన్ని పనులను వర్చువల్‌గా చేస్తానని... రేపు, సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమంలో కూడా తాను వర్చువల్‌‌గా పాల్గొంటానని శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా.. దేశంలో క‌రోనా కొత్త కేసులు భారీగా త‌గ్గుముఖం ప‌ట్ట‌గా.. మ‌ర‌ణాలు సైతం త‌గ్గాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త న‌మోదైన క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గ‌గా, మ‌ర‌ణాలు త‌గ్గాయి. కొత్తగా 27,409 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,26,92,943 కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో 82,817 (RECOVERED) మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,17,60,458 కి పెరిగింది. ప్ర‌స్తుతం 4,23,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 347 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే మ‌ర‌ణాలు స‌గానికి త‌గ్గాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,09,358 మంది కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.7 శాతంగా ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. క‌రోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.0 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 78,44,915 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 1,43,416 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి. కొత్త‌గా కేర‌ళ‌లో 8,989 కేసులు, 178 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. 

క‌రోనా (Coronavirus) నియంత్ర‌ణ కోసం కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌తో పాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్ప‌టివర‌కు దేశంలో మొత్తం 173.4 కోట్ల కోవిడ్‌-19 టీకాల‌ను పంపిణీ చేసిన‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 90.5 కోట్లు ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 74.3 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,18,03,766 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) వెల్ల‌డించింది. సోమ‌వారం ఒక్క‌రోజే 10,67,908 కోవిడ్‌-19 (Coronavirus) శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు తెలిపింది. అయితే, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌రోనావైర‌స్ ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్నాయి. అసోం రాష్ట్రంలో పూర్తిగా ఆంక్ష‌ల‌ను ఎత్తివేసింది. 

Scroll to load tweet…