ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
భోపాల్ : ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థ ప్రమాదకరం అయితే తెలంగాణలో కేసీఆర్ అవినీతి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకు సుపరిపాలన అందడంలేదని బిజెపి సీఎం శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు... ముందు తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి చూసుకోవాలని శివరాజ్ సింగ్ సూచించారు. దేశంలో అవినీతికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా మారిందని... ఇందుకు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబమే కారణమన్నారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అడ్డూఅదుపు లేకుండా ప్రజాసంపదను దోచేసారని ఎంపి సీఎం ఆరోపించారు.
జాతీయ రాజకీయాలు చేస్తానంటున్న కేసీఆర్ మధ్య ప్రదేశ్ లో ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నా స్వాగతిస్తామని శివరాజ్ సింగ్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో వున్న రాష్ట్రంలోనే ఇంతలా అవినీతికి పాల్పడుతున్న బిఆర్ఎస్ ను ఎంపి ప్రజలు నమ్మబోరని అన్నారు. మధ్య ప్రదేశ్ లో బిఆర్ఎస్ ఫోటీచేసినా ఏమాత్రం ప్రభావం చూపించదని సీఎం శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
Read More అమ్మఒడి సొమ్ము రావడం లేదని వెళ్తే.. వేలిముద్ర వేసుకొని డబ్బులు కాజేసిన వాలంటీర్..
ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై వివాదం సాగుతున్నవేళ సీఎం శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసిపి కార్యకర్తలనే జగన్ సర్కార్ వాలంటీర్లుగా నియమించింది... కాబట్టి వారు ప్రభుత్వం కోసం కంటే పార్టీ కోసమే పనిచేస్తారని అన్నారు. ఇలాంటి వ్యవస్థలు ప్రభుత్వంలో భాగంచేయడం అవకతవకలు జరిగే ప్రమాదం వుందన్నారు. పారదర్శకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థ వుండాలి కాని ఇలా పార్టీలకోసం పనిచేసే వ్యవస్థ అవసరం లేదని ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
