మధ్య ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో ముఖ్యమంత్రిగా నియమితులైన కమల్ నాథ్ వెంటనే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు రూ.2 లక్షలు రుణ మాపీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫైల్ పైనే ముఖ్యమంత్రి కమల్ నాథ్ మొదటి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన కొద్ది సేపటికే ఆయన ఆ ఫైలుపై సంతకం చేశారు.  

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమవడానికి ముందు (2018 మార్చి 31లోపు) రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు మాపీ కానున్నాయి. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వ, కోఆపరేటివ్
బ్యాంకుల్లో ఒక్కో రైతుకు అత్యధికంగా రూ. 2లక్షల వరకు రుణం మాపీ కానున్నాయి. వీటిని బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించనుంది.  

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆయా రాష్ట్రాల నాయకులు ముఖ్యంగా రైతులను టార్గెట్ చేసుకుని ప్రసంగాలు చేశారు. ప్రభుత్వ మేనిపెస్టోలో పెట్టిన రూ.2 లక్షల రుణమాపీ గురించి బాగా ప్రచారం చేశారు. 

మధ్య ప్రదేశ్ లో తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణాలు మాపీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. దీంతో అధికారం చేపట్టిన వెంటనే కమల్ నాథ్ రుణమాపీ ఫైలుపై సంతకం చేసి తామిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.  పార్టీ ఇచ్చిన ప్రధానమైన హామీ రుణమాపీని ఈ ప్రభుత్వం వెంటనే అమలుచేసింది...కాబట్టి మిగతా హామీలపై కూడా ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.