అతనికి అప్పటికే పెళ్లై తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ... మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఒకేసారి మూడు కాదు.. ఆరు ముళ్లు వేసి ఘనంగా వివాహం చేసుకున్నాడు. భార్యతో మళ్లీ పెళ్లే విడ్డూరం అనుకుంటే... ఆమె కళ్ల ముందే ఆమె చెల్లెలి మెడలో కూడా తాళికట్టాడు. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రం భింద్ జిల్లాకు చెందిన దీపు పరిహార్(35) కి వినాతా(28) తో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే... గత కొంతకాలంగా వినితా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. తాను చనిపోతే... తన ముగ్గురు పిల్లలు తల్లిలేని వాళ్లు అవుతారని ఆమె ఆవేదన చెందింది. అందుకే భర్తకు చెల్లితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది.

అది తన చివరి కోరిక అని భర్తను, చెల్లిని ఒప్పించింది. ఆమె కోరిక మేరకు దీపు పరిహార్ వినితాతోపాటు ఆమె చెల్లెలు రచనా (22) మెడలో తాళి కట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభార్యత్వం నేరం అనే విషయం తెలిసిందే.  ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని భింద్‌ ఎస్పీ రుడాల్ఫ్‌ అల్వారిస్‌ తెలిపారు. వినితా గుడావళి సర్పంచ్‌ కావడం మరో విశేషం.