వల్లభనేని బాలశౌరి అనే నేను... పార్లమెంటులో ప్రమాణం చేసిన మచిలీపట్నం ఎంపీ
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మూడోసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. సోమవారం ప్రారంభమైన 18వ లోక్ సభ తొలి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
దేశంలో కొలువుదీరిన 18వ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన 543 మంది పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది.. ఏపీ నుంచి 25 మంది, తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు వరుసగా ప్రమాణం చేస్తున్నారు. కొందరు అచ్చ తెలుగులో ప్రమాణం చేయగా... మరికొందరు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంటులో రెండు రోజులపాటు ఎంపీల ప్రమాణం స్వీకారం జరుగనుండగా... తొలిరోజు పలువురు ప్రమాణం చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా సోమవారం పార్లమెంటులో ప్రమాణం చేశారు. ‘‘వల్లభనేని బాలశౌరి అనే నేను...’’ అంటూ అచ్చ తెలుగులో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, బాలశౌరి మూడోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం, మొర్జంపాడు గ్రామంలో జన్మించిన ఆయన వ్యాపారవేత్త కాగా.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన బాలశౌరి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని.. వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మారాడు. 2004లో తొలిసారి తెనాలి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి మచిలీపట్నం లోక్ సభ ఎన్నికల బరిలో దిగి.. రెండోసారి గెలిచారు. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున మచిలీపట్నంలోనే బరిలోకి దిగి ముచ్చటగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వల్లభనేని బాలశౌరి మూడోసారి ఎంపీగా ప్రమాణం చేసిన సందర్భంగా జనసేన నాయకులు, ఆయన అభిమానులు అభినందనలు తెలియజేశారు.