న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అదనపు డైరెక్టర్ పదవి నుంచి తెలుగు అధికారి ఎం. నాగేశ్వర రావు బదిలీ ఆయ్యారు. ఒడిశా క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి నాగేశ్వర రావును సిబిఐ నుంచి తప్పించి ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. 

1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన నాగేశ్వర రావు రెండు మార్లు సిబిఐ తాత్కాలిక చీఫ్ గా పనిచేశారు. సిబిఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ఆయన డిప్యూటీ రాకేష్ అస్థానాకు మధ్య చెలరేగిన వివాదం నేపథ్యంలో వారిద్దరిని ఈ ఏడాది జనవరిలో సిబిఐ నుంచి తప్పించారు. 

ఆలోక్ వర్మను కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. ఆ సమయంలో నాగేశ్వర రావు సిబిఐ తాత్కాలిక చీఫ్ గా పనిచేశారు. సిబిఐ కొత్త డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లాను నియమించే వరకు ఆయన తాత్కాలిక చీఫ్ గా కొనసాగారు. 

అస్థానాపై ఆలోక్ వర్మ అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కేంద్రం జోక్యం చేసుకోవడంతో వారిద్దరు సిబిఐ నుంచి అక్టోబర్ లో తప్పుకోవాల్సి వచ్చింది. 

సుప్రీంకోర్టు జనవరి 10వ తేదీన తిరిగి నాగేశ్వర రావు స్థానంలో ఆలోక్ వర్మ సిబిఐ చీఫ్ గా నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన రెండు రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ద్రయాప్తు సంస్థ ఆలోక్ వర్మను ఆ పదవి నుంచి తప్పించింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహంలో పిల్లలపై జరిగిన లైంగిక దాడులపై దర్యాప్తు చేస్తున్న అధికారిని బదిలీ చేసిన వ్యవహారంలో నాగేశ్వర రావు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వచ్చింది. క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కోర్టు మూలలో కూర్చోవాలని సుప్రీంకోర్టు ఆయనకు అరుదైన శిక్షను వేసింది.