ఆ ప్రభుత్వ అధికారి జీతం రూ. 30 వేలు. 2016 నుంచి జాబ్ చేస్తున్నది. కానీ, ఆమె సంపాదించిన ఆస్తులు చూసి అధికారులే విస్తూపోయారు. రూ. 7 కోట్ల వరకు ఆమెకు ఆస్తులు ఉన్నట్టు తేల్చారు. ఇంకా తనిఖీలు జరుగుతున్నాయని వివరించారు. ఆమె ఆదాయంతో పోల్చితే సంపద 232 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. 

భోపాల్: ఆమె 2016 నుంచి ఉద్యోగం చేస్తున్నది. మధ్యప్రదేశ్ పోలీసు హౌజింగ్ కార్పొరేషన్‌లో కాంట్రాక్చువల్ ఇంచార్జీ అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరింది. నెలకు సుమారు రూ. 30 వేల జీతం. కానీ, ఆమె ఆస్తులు చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. రైడ్‌కు వెళ్లిన అవినీతి నిరోధక శాఖ అధికారులే ఖంగుతిన్నారు. ఆ అసిస్టెంట్ ఇంజినీర్ పేరు హేమా మీనా.

ఆమెకు వచ్చే జీతం.. ఆమె ఆస్తులు చూసిన కొందరికి ఆశ్చర్యం కలిగింది. ఆమె వ్యవహారం గురించి కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. వారు హేమా మీనా ఇంటికి వెళ్లారు. సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేస్తామని చెబుతూ ఆమె ఇంటికి వెళ్లి ఆస్తులు చూసి షాక్ అయ్యారు.

ఆమె ఇంటి వద్ద సుమారు 20 వాహనాలు ఉన్నాయి. అందులో ఐదు నుంచి ఏడు లగ్జరీ కారులు ఉన్నాయి. 20 వేల చదరపు అడుగుల భూమి ఉన్నది. రెండు డజన్ల పశువులను, అందులో గిర్ బ్రీడ్ కూడా ఉన్నాయి. రూ. 30 లక్షల 98 ఇంచ్‌ల టీవీ కనిపించింది. 100 కుక్కలను పెంచుతున్నారు. అక్కడంతా మొత్తం వైర్‌లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నది. మొబైల్ జామర్లు సహా ఇతర విలువైన వస్తువులు కనిపించాయి. లోకాయుక్త స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బృందం మంగళవారం ఆమె ఇంటిలోకి వెళ్లారు.

కేవలం ఒక్క రోజులోనే అధికారులు సుమారు రూ. 7 కోట్ల విలువైన ఆస్తులు కనుగొన్నారు. ఆమె ఆదాయంతో పోల్చితే ఈ సంపద 232 శాతం అధికంగా ఉన్నాయి.

Also Read: Karnataka Elections 2023: ‘కాంగ్రెస్, బీజేపీ మమ్మల్ని సంప్రదించాయి. నిర్ణయం తీసుకున్నాం’: జేడీఎస్ సంచలనం

ఆమె తొలుత 20 వేల చదరపు అడుగుల సాగు భూమి కొనుగోలు చేసింది. ఆమె తండ్రి పేరిట రిజిస్టర్ చేయించింది. అక్కడ రూ. 1 కోటి విలువైన విలాసవంతమైన ఇంటిని నిర్మించింది. ఈ విలాసవంతమైన ఇంటికితోడు ఆ ఇంజినీర్‌కు చెందిన రైజెన్, విదిశా జిల్లాలోనూ భూములు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

మధ్యప్రదేశ్ పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టులో ఉపయోగించ వలసని మెటీరియల్స్ ఆమె ఇంటి నిర్మాణంలో కనిపించాయి. హెవీ అగ్రికల్చర్ మెషినరీ కూడా లభించాయి. అందులో హార్వెస్టర్ కూడా ఉన్నది. వీటిని లోకాయుక్త అధికారుల బృందం సీజ్ చేసింది.

లోకాయుక్తకు ఫిర్యాదు అందిన తర్వాత బిల్కిరియాలోని మీనాకు చెందిన ఇంటిపైనా, మరో రెండు ప్రాంతాల్లో తనిఖీలు చేశామని లోకా యుక్త ఎస్పీ మను వ్యాస్ తెలిపారు.