Lumpy Skin Disease: రాజస్థాన్ లోని పశ్చిమ, ఉత్తర రాజస్థాన్ లో వేలాది పశువులు లంపీ చర్మ వ్యాధి బారిన పడి చ‌నిపోతున్నాయి. ఈ వ్యాధి కార‌ణంగా దాదాపు 1,200 పశువులు చనిపోయాయని పశుసంవర్థక శాఖ తెలిపింది.

Lumpy Skin Disease: రాజస్థాన్ లో గ‌త కొన్ని రోజులుగా పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశ్చిమ, ఉత్తర రాజస్థాన్ లో వేలాది పశువులు లంపీ చర్మ వ్యాధి బారిన పడి చ‌నిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో నమ్మశక్యం కాని విధంగా లంపీ చర్మ వ్యాధి వ్యాపిస్తున్నది. ఈ వ్యాధి కార‌ణంగా దాదాపు 1,200 పశువులు చనిపోయాయని పశుసంవర్థక శాఖ తెలిపింది.

మూడు నెలల వ్యవధిలో దాదాపు 25 వేల పశువులకు ఈ వ్యాధి సోకిందని పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. లంపీ చర్మ వ్యాధి బారిన పడి ఆవులు, గేదెలు తీవ్రంగా ఇబ్బంది పడి.. చనిపోతున్నాయి. ఈ వైరల్ వ్యాధి ఇప్పటికే రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ్యాప్తి చెందింద‌ని అధికారులు తెలిపారు. ఒక్క జోధ్ పూర్ జిల్లాలోనే గత రెండు వారాల్లో 254 పశువులు వ్యాధి బారిన పడి మృతి చెందిన‌ట్టు పశుసంవర్థక శాఖ గుర్తించింది.

అంటువ్యాధి యొక్క తీవ్రమైన వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. పశుసంవర్థక శాఖ ప్రభావిత ప్రాంతాలలో వైద్యుల బృందాలను సమీకరించింది. వ్యాధి బారిన పడకుండా తమ పశువులను ఒంటరిగా ఉంచాలని పశువుల యజమానులకు సూచించింది. రాణివాడ (జలోర్) బిజెపి ఎమ్మెల్యే నారాయణ్ సింగ్ దేవల్ సంక్రమణ వ్యాప్తిని అరికట్టడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

 ఆఫ్రికాలో పుట్టిన ఈ వ్యాధి ఏప్రిల్‌లో పాకిస్థాన్ మీదుగా భారత్‌కు వచ్చిందని పశుసంవర్థక శాఖ వెల్లడించింది. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. మొదట జైసల్మేర్, బార్మర్ వంటి సరిహద్దు జిల్లాలలో ఈ సంక్రమణ వ్యాపించిందని, ఇప్పుడు ఆ వ్యాధి జోధ్‌పూర్, జలోర్, నాగౌర్, బికనీర్, హనుమాన్‌గఢ్, ఇతర జిల్లాలకు వ్యాపించిందని చెప్పారు. ఇప్పటికే బాధిత ప్రాంతాల్లో మా బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

వ్యాధి లక్షణాలు ఏమిటి?

ఈ వ్యాధి ప్రధానంగా దేశవాళీ ఆవులను ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు సుమారు 25,000 ఆవులు ప్రభావితమయ్యాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఆవుల్లో ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇతర వ్యాధులు కూడా దాడి చేయ‌డంతో జంతువు చనిపోతుంది. ఈ వ్యాధికి మందు, వ్యాక్సిన్ లేవు. లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అంద‌జేస్తున్నారు.

 వ్యాధి వ్యాప్తి..
ఈ అంటు వ్యాధి దోమలు, ఈగలు, పేలు, కందిరీగలు, పశువుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. 

లక్షణాలు

ఈ వ్యాధి సోకిన ప‌శువుల‌కు అధిక‌ జ్వరం. కళ్లు, ముక్కు నుంచి స్రావాలు కార‌టం. శరీరమంతా పొక్కులు(చికెన్ పాక్స్). మచ్చలు ఏర్పడ‌టం. నోటిలో బొబ్బలు. పాల ఉత్పత్తి తగ్గుతుంది. వ్యాధి నిరోధ‌క‌త పూర్తిగా త‌గ్గ‌డంతో పశువులు మృతి చెందుతాయి. అయితే సకాలంలో చికిత్స అందిస్తే ఆవులకు ప్రాణాపాయం ఉండదని వైద్యులు అంటున్నారు.

కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టి

ఆవుల్లో వ్యాపించే లంపీ చర్మ వ్యాధి నివారణ చర్యలపై అధ్యయనం చేసేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తల బృందాన్ని పశ్చిమ రాజస్థాన్‌కు పంపినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. శాస్త్రవేత్తల సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన ట్వీట్ చేశారు.

మ‌రోవైపు.. గుజరాత్‌లో కూడా లంపీ చర్మ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకు వేయి వ‌ర‌కు ఆవులు, గేదెలు చనిపోయాయని ఆ రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్థక శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ చెప్పారు. మరో 37,000 ప‌శువులు చికిత్స పొందుతున్నాయని తెలిపారు. ఈ వ్యాధి ఇప్పటికే 14 జిల్లాల్లో వ్యాప్తి చెందింది.