లక్నోలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ... దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో త్వరలోనే ప్రపంచ స్థాయి ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి, రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
లక్నో : ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి యోగి సర్కార్ సిద్దమయ్యింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమావేశమై ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై చర్చించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ డిజైన్, నిర్మాణ ప్రక్రియ, ఖర్చు వంటి అంశాలపై అధకారులతో సీఎం చర్చించారు.
జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాల నిర్వహణకు లక్నోలో అన్ని సౌకర్యాలతో కూడిన హైటెక్ కన్వెన్షన్ కమ్ ఎగ్జిబిషన్ సెంటర్ అవసరమని సీఎం యోగి అభిప్రాయపడ్డారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ఆవాస్ వికాస్, ఎల్‌డిఏల ఆధ్వర్యంలో జరగాలని ... రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. నిర్మాణ పనులకు రెండేళ్లలో పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ఈ కన్వెన్షన్ సెంటర్ అన్నివిధాలుగా ఉపయోగపడేలాా నిర్మించాలని సీఎం సూచించారు. పెద్ద సాంస్కృతిక, రాజకీయ, ప్రభుత్వ, మతపరమైన కార్యక్రమాలతో పాటు సంగీత కచేరీలు, సాహిత్య సభలు వైభవంగా నిర్వహించుకునేలా ఉండాలన్నారు. అన్ని రకాల ప్రదర్శనలు నిర్వహించేలా ఎగ్జిబిషన్ సెంటర్, ఓపెన్ థియేటర్, హోటళ్ల నిర్మాణానికి స్థలం కేటాయించాలని సూచించారు.
భవన నిర్మాణంలో భారతీయ సంస్కృతి ప్రతిబింబించాలని... నీరు, ఇంధన పొదుపుకు ఉదాహరణగా నిలవాలని సీఎం సూచించారు. కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తరప్రదేశ్ ఓడీఓపీ ఉత్పత్తులు, ప్రత్యేక వంటకాలు, జానపద కళలు, సంగీత ప్రదర్శనలు నిరంతరం ఉండాలన్నారు. చిన్న, పెద్ద, భారీ వాహనాల పార్కింగ్, అగ్నిమాపక వ్యవస్థ, టాయిలెట్లు, ఫుడ్ కోర్టు వంటి వసతులు కల్పించాలని సీఎం యోగి ఆదేశించారు.
ఇటీవల జరిగిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో గురించి సీఎం ప్రస్తావిస్తూ... ఇలాంటి కార్యక్రమాలకు లక్షలాది మంది వస్తారన్నారు. కాబట్టి ఎంత జనం వచ్చినా ఇబ్బందిలేకుండా వుండేలా తాజాగా నిర్మించే కఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ వుండాలన్నారు. ప్రదర్శనశాలల రూపకల్పనలో దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని యోగి ఆదిత్యనాథ్ సూచించారు.
కన్వెన్షన్ సెంటర్ ప్రతిపాదన గురించి అధికారులు సీఎం యోగికి వివరిస్తూ... 2020లో డిఫెన్స్ ఎక్స్‌పో జరిగిన వృందావన్ యోజనలో 32 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. అక్కడ ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టవచ్చని అన్నారు. ఇక్కడికి అన్నివైపుల నుంచి రవాణా సౌకర్యం ఉందని తెలిపారు. దాదాపు 10 వేల మంది సామర్థ్యం గల ఈ కన్వెన్షన్ సెంటర్‌లో వివిధ ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, వీఐపీ లాంజ్‌లు ఉంటాయని, పంచభూతాలను ప్రతిబింబించే 'పంచ వాటిక' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు.