తన కొడుకు తన కన్నా గొప్పవాడు కావాలి.. గొప్ప స్థితిలో ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ప్రజలు ఆ కొడుకుని చూసి మెచ్చిన రోజే తండ్రికి నిజమైన సంతోషం. ఇలాంటి స్టోరీలు చాలా సినిమాల్లో చూసుంటాం. కానీ అలాంటి నిజమైన కథే ఓ చోట జరిగింది.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విబూతిఖండ్ పోలీస్ స్టేషన్‌లో చిన్న కానిస్టేబుల్‌గా పనిచేసే జనార్థన్ సింగ్‌కు ఒక కొడుకు అనూప్ సింగ్, కూతురు మధు ఉన్నారు.  చాలీచాలనీ జీతంతో మధ్య తరగతి జీవితాన్ని సాగిస్తున్నా.. ఇద్దరు పిల్లల్ని చక్కగా చదివించాడు జనార్థన్ సింగ్.

కొడుకును ఎలాగైనా ఐపీఎస్‌ను చేయాలనుకున్నాడు.. తండ్రి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్న అనూప్ కుమార్.. కష్టపడి చదివి ఐపీఎస్ అయ్యాడు. కేంద్రప్రభుత్వం ఆయనను సొంత రాష్ట్రానికి చెందిన క్యాడర్‌నే కేటాయించింది. ఈ క్రమంలో అనూప్ కుమార్ తండ్రి పని చేసే జిల్లాకే ఎస్పీగా బదిలీ అయ్యాడు.

ఓ రోజు స్టేషన్ తనిఖీకి వచ్చిన కుమారుడిని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు.. ఉద్వేగంతో శాల్యూట్ చేశాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. బాస్ హోదాలో తన కొడుకుకి శాల్యూట్ చేయడంలో తప్పేమీ లేదన్నాడు.. ముందు ఆఫీసర్‌గా తన కుమారుడిని గౌరవిస్తానని.. ఇంటికొచ్చాక తండ్రిగా ప్రేమ చూపిస్తానన్నారు.

మరోవైపు తండ్రే తనకు స్పూర్తి అంటున్నారు అనూప్ కుమార్.. ప్రతిరోజు తండ్రి పాదాలకు నమస్కరించి.. ఆశీర్వాదం తీసుకుంటానని గర్వంగా చెప్పారు. తన తండ్రి కష్టపడి చదివించారని.. రోజూ సైకిల్‌పై తనను, సోదరిని స్కూల్‌కు తీసుకెళ్లేవారని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.  ఈ దీపావళిని తన కుటుంబంతో కలిసి సంతోషంగా చేసుకుంటానన్నారు.