భారత కొత్త సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివంగత బిపిన్ రావత్ స్థానంలో త్రివిధ దళాల అధిపతిగా అనిల్‌ను ఎంపిక చేసింది కేంద్రం. 

భారత కొత్త సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివంగత బిపిన్ రావత్ స్థానంలో త్రివిధ దళాల అధిపతిగా అనిల్‌ను ఎంపిక చేసింది కేంద్రం. ఈ హోదాలో ఆయన భారత ప్రభుత్వానికి సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగానూ పనిచేస్తారు. దాదాపు 40 ఏళ్ల కెరీర్‌లో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ అనేక కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రుమెంటల్ హోదాల్లో విధులు నిర్వర్తించారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలలో ఆయనకు విస్తృతమైన అనుభవం వుంది. 

1961 మే 18వ తేదీన జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ .. 1981లో ఇండియన్ ఆర్మీలోని 11వ గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్‌వాస్లా, ఇండియన్ మిలటరీ అకాడమీ డెహ్రాడూన్ పూర్వ విద్యార్ధి. మేజర్ జనరల్ హోదాలో నార్తర్న్ కమాండ్‌లోని క్లిష్టమైన బారాముల్లా సెక్టార్‌లో పదాతిదళ విభాగానికి నాయకత్వం వహించారు. అనంతరం లెఫ్టినెంట్ జనరల్‌గా నార్త్ ఈస్ట్‌లో ఒక కార్ప్స్‌కి నాయకత్వం వహించారు. తర్వాత సెప్టెంబర్ 2019 నుంచి తూర్పు కమాండ్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌ వ్యవహరించారు. 2021 మే 31లో పదవీ విరమణ చేసే వరకు ఆయన ఈ హోదాలో పనిచేశారు. 

అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా అంగోలాలో విధులు నిర్వర్తించారు. సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత.. ఆయన జాతీయ భద్రత, వ్యూహాత్మక విషయాలపై కేంద్రానికి సహకారం అందించారు. సైన్యంలో విశిష్టమైన సేవలకు గాను లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)కు పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, సేనా పతకం, విశిష్ట సేవా పతకం పొందారు. 

గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. అప్ప‌టి నుంచి భారత సీడీఎస్ ప‌ద‌వి ఖాళీగా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. 62 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లెఫ్టినెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్-అడ్మిరల్ స‌ర్వీస్ చేసినా లేక‌పోతే రిటైర్డ్ అయిన వ్య‌క్తి సీడీఎస్ గా ఎంపిక‌వ్వ‌డానికి అర్హుడిగా ఉంటారు. భారత త్రివిధ దళాల్లోని మూడు విభాగాల పనితీరులో ఏకీకరణను తీసుకురావడానికి, దేశం మొత్తం సైనిక పరాక్రమాన్ని పెంచడానికి సీడీఎస్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత భారతదేశ భద్రతా వ్యవస్థలోని లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రికి సింగిల్ పాయింట్ మిలటరీ అడ్వైజర్‌గా సీడీఎస్ ను నియమించాలని ప్యానెల్ సిఫార్సు చేసింది. ఈ క‌మిటీ సిఫార్సుల ఆధారంగానే సీడీఎస్ నియామ‌కం జ‌రిగింది.