హిమాచల్ ప్రదేశ్‌లో ప్రేమికుల ఆలయం ఉన్నది. దేశం నలుమూలల నుంచి వచ్చిన ఏ కులం, మతం, వర్గం వారైనా సరే.. ఆ ప్రేమ జంటను ఆలయం స్వాగతిస్తుంది. ఆహారం, ఆశ్రయం కల్పిస్తుంది. అవసరమైతే పెళ్లి చేస్తుంది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉండటానికి అవకాశం ఇస్తుంది. అదే షాంగ్చుల్ మహాదేవ్ టెంపుల్.
Vantines: ఒక వైపు ప్రేమ వివాహాలను బాహాటంగా వ్యతిరేకించేవారు.. అందునా కులాంతర, మతాంతర వివాహాలపై దారుణంగా తప్పుపట్టేవారు ఉండగా.. మరోవైపు ప్రేమ వివాహాలను గౌరవించి, అవసరమైతే పెళ్లి చేసి ఆశ్రయం కల్పించే ఓ ఆలయం ఉండటం ఆశ్చర్యకరం. మీరు విన్నది నిజమే. కులులోని ఓ శివాలయం ప్రేమను అన్ని రూపాల్లో స్వాగతిస్తుంది. ఇంటి నుంచి పారిపోయి వచ్చినా.. పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదని వచ్చినా.. వారిని ఆ ఆలయం చేరదీస్తుంది. పెళ్లి చేస్తుంది. ఇరు కుటుంబాలు అంగీకరించేవరకు ఆశ్రయం కల్పిస్తుంది. అంతేకాదు, వారి భద్రతనూ పర్యవేక్షిస్తుంది. ఈ ఆలయంలోకి పోలీసులకూ అనుమతి లేకపోవడం గమనార్హం.
ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధిగాంచిన హిమాచల్ ప్రదేశ్‌లో కులులోని షాంగడ్ గ్రామంలో ఉన్నది ఈ పురాతన శివాలయం. మహా భారత కాలంతో సంబంధం ఉన్నదని చెప్పుకునే ఈ ఆలయాన్ని షాంగ్చుల్ మహదేవ్ అని పిలుస్తారు.
కుటుంబానికి, ఈ సొసైటీకి భయపడి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకునే జంటలను ఈ ఆలయం చేరదీస్తుంది. వారి జీవనం, ఆహారం, భద్రత గురించి ఏర్పాట్లు జరుగుతాయి. స్థానిక ప్రజలు ఆ ప్రేమ జంటను స్వాగతిస్తారు. ఈ ఆలయంలో ఉన్నవారిని శంకరభగవానుడు కాపాడుతాడని స్థానికుల నమ్మకం. అందుకే అక్కడ ఎవరికీ ఏ ప్రమాదం జరగదని తలుస్తారు. ఏ కులం, మతం, వర్గానికి చెందిన ప్రేమికులనైనా ఈ ఆలయం స్వాగతిస్తుండటం గమనార్హం.
Also Read : సోనియా గాంధీ, రేణుకా చౌదరి రాజ్యసభకు.. ఖమ్మం లోక్ సభ టికెట్ ఎవరికబ్బా!
ఇక్కడి గ్రామాల్లో సొంత నియమాలు అద్భుతంగా ఉంటాయి. ధూమపానం, మద్యపానం నిషేధం. ఎవరూ పెద్ద గొంతుతో గొడవపడరు. ప్రేమికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అక్కడి నుంచి వెళ్లగొట్టరు. ఇంతటి ప్రత్యేకతలు గల ఆలయానికి దేశం నలుమూలల నుంచి ప్రేమికులు వస్తుంటారు. దేవుడిని దర్శించుకుని వెళ్లుతుంటారు.
