ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని జీవితాంతం ఒకరితో కలిసి మరొకరు జీవించాలని అనుకున్నారు. వారు కన్న కలలు అన్నీ... మధ్యలోనే ఆవిరైపోయాయి. ఇద్దరూ కారులో విగత జీవులుగా పడి కనిపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సేలం సెవ్వాపేటకు చెందిన గోపీ అనే వ్యక్తి వెండి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమారుడు సురేష్(22) చదువు మధ్యలో ఆపేసి తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. కాగా.... మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సురేష్.. తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో.. కంగారు పడిన కుటుంబసభ్యులు వెంటనే అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు.  కాగా కాగా, గుహై ప్రాంతంలోని తిరుచ్చి రోడ్డులో గోపికి ఓ కారు షెడ్డు ఉంది. ఈ షెడ్డు వద్ద మంగళవారం రాత్రి సురేష్‌ బైకు కనిపించింది. చాలాసేపు ఆ బైకు బయటే ఉండడంతో సందేహించిన స్థానికులు షెడ్‌లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉన్న కారులో సురేష్, ఒక యువతి మృతదేహాలుగా కనిపించారు.

సమాచారం అందుకున్న సెవ్వాపేట పోలీసులు అక్కడికి వచ్చి కారులో ఉన్న సురేష్, ఆ యువతి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో సురేష్‌తో పాటు మృతి చెందిన యువతి గుహై ప్రాంతానికి చెందిన జ్యోతి అని, ఆమె సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నట్టు తెలిసింది. 

వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్టు, వీరి ప్రేమకు ఇరు కుటుంబీకులు వ్యతిరేకత తెలపడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేదా కారులో గ్యాస్ లీకేజీ కారణంగా చనిపోయారా అన్న విషయం తెలియాల్సి ఉంది. పోస్టు మార్టం రిపోర్టు వస్తే.. వారి చావుకి అసలు కారణం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు.