Asianet News TeluguAsianet News Telugu

నువ్వే ఓ బాంబర్.. ప్రియుడితో ప్రియురాలి సరదా చాటింగ్...ఆరు గంటల పాటు ఆగిపోయిన విమానం...

ప్రేమికుల మధ్య సరదా సంభాషణ కొంపముంచింది. మంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ఆరుగంటల పాటు ఆగిపోయేలా చేసింది. ప్రియురాలు ప్రయాణం మానుకుని వెనక్కి వెళ్లేలా చేసింది. అసలేం జరిగిందంటే...

lovers fun chatting caused flight stopped for six hours in mangaluru
Author
Hyderabad, First Published Aug 16, 2022, 6:47 AM IST

మంగళూరు :  ప్రేమికుల మధ్య సరదామాటలు, ఏడిపించుకోవడాలు, ఆటపట్టించుకోవడాలు మామూలే.. ‘నువ్వే ఓ పెద్ద దొంగవి..నా మనసు దోచేశావ్’.. ఇలాంటి మాటలు కామన్ గా వినిపిస్తుంటాయి. అయితే ఇవే ఓ పెద్ద గందరగోళానికి దారి తీసిన ఘటన మంగళూరులో చోటు చేసుకుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సరదా సంభాషణ 185 మందిని భయాందోళనలకు గురి చేసింది.  ప్రియుడు, ప్రియురాలి మధ్యలో ఆట పట్టించుకోవడం.. అదీ ఇద్దరూ దూరంగా ఉన్నప్పుడు మొబైల్ చాటింగ్ లోనూ కొనసాగడం పెద్దతంటా తెచ్చిపెట్టింది. ఏకంగా  మంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఆరు గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చింది. అదేలా అంటారా… ఈ స్టొరీ చదివితే మీకే అర్థమవుతుంది..

ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి ఆదివారం మంగళూరు విమానాశ్రయానికి వచ్చాడు. ప్రియుడు ముంబై వెళ్లేందుకు.. ప్రియురాలు బెంగళూరు వెళ్లేందుకు విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. ముంబై వెళ్లే విమానం రాగానే యువకుడు వెళ్లి కూర్చున్నాడు. ప్రియురాలు తన విమానం కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మొబైల్ చాటింగ్ జరుగుతోంది. చాటింగ్ నేపథ్యంలో వీరి మధ్య విమానాల్లో భద్రత గురించి  వచ్చింది… అదే సందర్భంలో ప్రియురాలు సరదాగా ‘నువ్వే ఓ బాంబర్’ అంటూ మెసేజ్ చేసింది.

సియాచెన్‌లో మంచుతుఫాన్‌లో కనిపించకుండా పోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత మృతదేహం లభ్యం

మామూలుగా లవర్స్ మధ్య  జరిగిన ఈ సంభాషణ మెసేజ్ విమానంలో యువకుడి వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలి కంట్లో పడింది.  దీంతో ఆమె భయాందోళనలకు గురి అయింది. వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించింది. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ను అప్రమత్తం చేశారు. దీంతో టేకాఫ్ అవ్వాల్సిన  విమానం కాస్త ఆగిపోయింది. అసలే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భం.. ఆగస్టు 15.. ఉగ్రకుట్రలు లాంటివి జరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులు అందరినీ  విమానం దించేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 

అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఆ తర్వాత  చాటింగ్ చేసిన ప్రియుడు, ప్రియురాలిని పోలీసులు కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. అది కేవలం సరదా సంభాషణ అని తేలడంతో విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతిచ్చారు. విచారణ అనంతరం ప్రియుడిని  విమానం ఎక్కేందుకు అధికారులు అనుమతించారు. ప్రియురాలు మాత్రం విమానం ఎక్క లేకపోయింది. అది ఫ్రెండ్లీ చాటింగ్ అని తేలడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని, దీంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios