కర్ణాటకలో లవ్‌ జిహాద్‌ ఉదంతం కలకలం రేపుతోంది. యువతిపై రెండేళ్లుగా అత్యాచారం చేసి, పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలంటూ బలవంతం చేశారో అన్నాదమ్ములు. ఈ కేసులో ఒకరిని సోమవారం బెంగళూరు చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు అరెస్ట్‌చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెడితే.. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన షబీర్‌ అహ్మద్, రిల్హాన్‌ సోదరులు బెంగళూరులో హోటల్‌ నడుపుతున్నారు. 2018లో వారి హోటల్‌లో ఓ19 ఏళ్ల యువతి రిసెప్షనిస్టుగా చేరింది. ఆమె మీద కన్నేసిన షబ్బీర్‌ అహ్మద్‌ ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 

2019లో నాలుగుసార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు ఎవరికైనా ఈ విషయం చెబితే ఉద్యోగం తీసేస్తానని, యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు. తరువాత రిల్హాన్‌ ఆమెను కలిసి నా సోదరుడు నీకు అన్యాయం చేశాడని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత యువతి తల్లిదండ్రులతో నిశ్చితార్థం పేరు చెప్పి 2 నెలల క్రితం లక్షన్నర రూపాయలకు తీసుకున్నాడు. 

గతేడాది నవంబరు 20న పెళ్లికి ఫంక్షన్‌ హాల్‌ను మాట్లాడి, పెళ్లిపత్రికలు కూడా ముద్రించారు. ఈ సమయంలో దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఉంది, పాస్‌పోర్ట్‌ కోసమంటూ ఖాళీ పేపర్లపై సంతకం చేయించుకుని మతం మారాలని బలవంతం చేసి మాయమయ్యాడు. 

అయితే.. అతను అప్పటికే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం బాధితురాలు షబీర్, రిల్హాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి షబీర్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు.