ఉత్తర్ ప్రదేశ్ లో లవ్ జిహాద్ పేరుతో మతం మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 18 ఏళ్ల యువతిని కిడ్నాప్‌ చేసి, బలవంతంగా మతం మార్చడానికి  ప్రయత్నించాడో వ్యక్తి. వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ మీరట్ కు చెందిన 25 యేళ్ల అమన్ అనే యువకుడు తన వద్దకు ట్యూషన్ కోసం వస్తున్న యువతితో స్నేహం పెంచుకున్నాడు. 

ఆ అమ్మయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని కోరాడు. దీనికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే యువతి తమ్ముడ్ని హత్య చేస్తానని బెదిరించాడు. ఈ మేరకు యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 

అంతేకాకుండా యువతిని కిడ్నాప్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లాడు అమన్. అక్కడ ఆమెను ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించాడు. ట్యూషన్ కు వెళ్లిన యువతి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కంగారు పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అంతేకాదు ట్యూషన్ టీచర్ అమన్ తమ కూతురిని కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో వారు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ట్రేసింగ్ తో యువతి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అమన్‌ను అరెస్ట్‌ చేసి, యువతిని  తల్లిదండ్రులకు అప్పగించారు. 

తాను ఒప్పుకోకపోవడంతో బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించినట్లు యువతి తెలపడంతో అమన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టారు.