పుణె: అలిగిన ప్రేయసిని బుజ్జగించడం కోసం ప్రియుడు చేసే పనులు మామూలుగా ఉండవు...ఏం చేసినా పరిధికి లోబడే చెయ్యాలి. కానీ పరిధి దాటితే పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు పూణే లోని ఓ యువకుడు. ప్రేయసి మెప్పు కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ప్రియుడు చిక్కుల్లో పడ్డాడు. 

పుణెలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన 25ఏళ్ల నీలేశ్‌ ఖేడెకర్‌ ఎంబీఏ చదువుతున్నాడు. తన ఫ్యామిలీ బిజినెస్ లలో ఒక డైరెక్టర్ కూడా. అయితే తన ప్రేయసితో గొడపెట్టుకున్నాడు. దీంతో ఆమె మాట్లాడటం లేదు. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. 
ఆమె ముంబై నుంచి పూణె వెళ్తుందని తెలుసుకున్నాడు నీలేశ్. దీంతో ఆమె నివాసం ఉంటున్న సాయి చౌక్ మరియు హౌసింగ్ సొసైటీ రహదారి వెంబడి నాలుగు కిలోమీటర్ల మేర నీలేశ్ ఖేడెకర్ రాత్రికి రాత్రే తన స్నేహితుడి సహాయంతో అయామ్‌ సారీ అంటూ ఆమె పేరు రాసిన సుమారు 300 బ్యానర్లు కట్టేశాడు. ఆ బ్యానర్ లలో రెడ్ కలర్ లలో హార్ట్ సింబల్ వేసి మరీ సారీ చెప్పాడు. అందుకు 72 వేల రూపాయలు ఖర్చు చేశాడట.

ప్రియుడు చేసిన ప్రయత్నం ప్రేయసికి నచ్చిందో లేదో తెలీదు కానీ పూణె మున్సిపల్‌, పోలీస్‌ శాఖలకు మాత్రం నచ్చలేదు. బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్‌లు,ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పెట్టడం నిషేదం. దీంతో నీలేశ్‌పై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వార్త  సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

అయితే  ఈ విషయంపై నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. ప్రియురాలి కోసం చేసిన పని కాబట్టి క్షమించి వదిలేయాలని కొందరు కోరుతుంటే.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు నీలేశ్ ను విచారిస్తున్నారు.