తమిళనాడులో దారుణం జరిగింది. ప్రేమ వివాహం ఇష్టం లేకపోవడంతో ప్రియురాలి తండ్రి ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని విలాంగట్టూరు గ్రామానికి చెందిన పొన్నుసామి భార్య సెల్వి ... ఈమె కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన బంధువు కొలుంజి కుమార్తెతో పరిచయం ఏర్పడి.. అది ప్రేమగా మారింది.

తమ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవని భావించిన వారిద్దరూ ఇల్లు విడిచి పారిపోయారు. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డుపైకి వచ్చి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సెల్వి ఇంటి ముందు నిలుచుని ఉంది.

ఆ సమయంలో కొలుంజి అక్కడికి వచ్చి.. నా బిడ్డను ఎక్కడ ఉంచారో చెప్పు..!!! అంటూ ఆమెను అసభ్యపదజాలంతో దూషించాడు. అక్కడితో ఆగకుండా సెల్విని స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సెల్విని రక్షించి విరుదాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొలుంజిని అరెస్ట్ చేశారు.