ఇద్దరికీ వివాహాలు అయ్యాయి.. చక్కని కుటుంబాలు ఉన్నాయి. కానీ... వాటన్నింటినీ కాదని వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. తమ బంధాన్ని లోకం అంగీకరించదనే బాధతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని కన్నుమూశారు.ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రెడ్డియూర్ పెరుమాల్ కౌండర్ కాలనీకి చెందిన శంకర లింగమ్ కుమారుడు గోపీనాథ్(31) అదే ప్రాంతానికి చెందిన రాజేశ్వరి(33)తో ఈ నెల 19న విల్లుపురం జిల్లా త్యాగదురుగమ్ కి వచ్చారు.

తామిద్దరం భార్యభర్తల మని చెప్పి.. ఓ గది అద్దెకు తీసుకున్నారు.  క్రమంలో బుధవారం గోపినాథ్, రాజేశ్వరి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యల కారణంగా భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావించారు. అయితే.. అక్కడ కథ అడ్డం తిరిగింది. 

మరోవైపు పల్లపట్టి పోలీసు స్టేషన్‌లో గోపినాథ్‌ కనబడడంలేదని అతని భార్య ఉమా, రాజేశ్వరి కనబడడం లేదని అళగపురం పోలీసు స్టేషన్‌లో ఆమె భర్త ముల్‌లై వేందన్‌ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వీరు వివాహేతర ప్రేమ జంట అని తెలిసింది. 5 నెలల క్రితం వీరికి పరిచయం ఏర్పడి అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఇరు కుటుంబీకులు వీరి ప్రేమకి వ్యతిరేకించడంతో ఇద్దరూ ఇంటి నుంచి బయటకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.