మసీదుల్లో లౌడ్‌స్పీకర్లకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల ఏర్పాటు ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పేర్కొంది. యూపీ, మహారాష్ట్రాల్లో లౌడ్‌స్పీకర్ విషయమై రాజకీయం జరుగుతున్న తరుణంలో ఈ ఆదేశాలు రావడం గమనార్హం.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో లౌడ్‌స్పీకర్ల వివాదం రగులుతున్నది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తీసేయాలని, లేదా నిర్ణీత శబ్ద అవధికి లోబడే ఉండాలనే డిమాండ్లు బలంగా వస్తున్నాయి. మత ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి ముందస్తుగా అనుమతులు తీసుకోవాలనే నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల ఏర్పాటు ప్రాథమిక హక్కు కిందకు రాదని స్పష్టం చేసింది.
మసీదులో లౌడ్‌స్పీకర్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. మసీదులో లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు ప్రాథమిక హక్కు కాదని పేర్కొంటూ డిస్మిస్ చేసింది. జస్టిస్ వివేక్ కుమార్ బిర్ల, జస్టిస్ వికాస్‌ల డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు పాస్ చేసింది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లను మసీదుల్లో కలిగి ఉండాలనేది రాజ్యాంగ హక్కు కాదని చట్టం చెబుతున్నదని బుధవారం ఈ డివిజన్ బెంచ్ వివరించింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. దొరాన్‌పూర్ గ్రామంలో అజాన్ ప్రార్థనకు నూరి మసీదులో లౌడ్‌స్పీకర్ ఏర్పాటుకు బదౌన్ జిల్లా బిసౌలీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ 2021 డిసెంబర్ 3వ తేదీన వ్యతిరేకించాడు. లౌడ్‌స్పీకర్ ఏర్పాటుకు అనుమతిని కోరగా.. ఆయన తిరస్కరించాడు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆదేశాలను సవాల్ చేస్తూ వారు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆదేశాలు చట్టవ్యతిరేకం అని, ప్రాథమిక, న్యాయపరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా, ఈ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.
మతపరమైన ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లకు సంబంధించి సీఎం యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మతపరమై ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్ల నుంచి వచ్చే శబ్దాలు ఆ ప్రాంగణం దాటి బయటకు రావొద్దని అన్నారు. ముందస్తు అనుమతితో మతప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లు వినియోగించుకోవచ్చని వివరించారు. కానీ, లౌడ్‌స్పీకర్లు అమర్చిన ప్రాంగణం నుంచి ఆ చప్పుడు బయటకు రావొద్దని తెలిపారు. యోగి ఆదిత్యానాథ్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఆలయాలు, మసీదులు సహా సుమారు 17 వేల మత
ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్ల వాల్యూమ్ నిర్ణీత అవధిలోనే ఉంచుతున్నారు.
