బీజేపీ మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు దేవుడే కాదని స్పష్టం చేశారు. ఆయన తులసీదాస్, వాల్మికీలు రాసిన కథలో ఓ క్యారెక్టర్ మాత్రమేనని అన్నారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కుల వివక్షను ప్రస్తావించారు. 

పాట్నా: బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి పార్టీ, బీజేపీ మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ భావజాలంలో కేంద్రస్థానంలో ఉండే రాముడిపైనే ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘నేను రాముడిని విశ్వసించను. రాముడు దేవుడే కాదు. ఆయన తులసీదాసు, వాల్మికీలు వారి సందేశాలను వ్యాపింపజేయడానికి అల్లుకున్న కథలోని ఒక పాత్ర మాత్రమే’ బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ అన్నారు.

‘వారు రామాయణాన్ని రాశారు. అందులో ఎన్నో మంచి పాఠాలు ఉన్నాయి. మనం వాటిని నమ్ముతాం. మనం తులసీదాస, వాల్మికీలను నమ్ముతాం, కానీ, రాముడిని కాదు’ అని పేర్కొన్నారు. మాంఝీ కొడుకు బిహార్‌లోని నితీష్ కుమార్-బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. 

బిహార్‌లో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) కూటమిలో బీజేపీతోపాటు హిందుస్తాన్ ఆవామ్ మోర్చా కూడా ఉన్నది. ఈ పార్టీ చీఫ్ జితన్ రామ్ మాంఝీ గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మీరు రాముడిని విశ్వసిస్తే.. శబరి తిని ఇచ్చిన ఫలాన్ని రాముడు తిన్నాడనే కథను తరుచూ వినే ఉంటారు. మీరు మేం తిన్న ఫలాన్ని తినరు. అది సరే.. కానీ, మేం ముట్టుకున్న ఫలాన్ని అయినా తినండి’ అంటూ జితన్ రామ్ మాంఝీ అన్నారు. దేశంలో కుల విభజన గురించి ఆయన పరోక్షంగా చేసిన దాడి ఇది. ప్రపంచంలో కేవలం రెండే కులాలు ఉన్నాయని, ఒకటి ధనిక, మరొకటి పేద అని వివరించారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో రామ నవమి సందర్భంగా చేపట్టిన యాత్రల్లో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటనలు జరిగాయి. ఇద్దరు మరణించారు. మరెంతో మంది గాయపడడారు.

రాముడి జన్మదిన వేడుక‌లు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రిగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకుని దేశ‌వ్యాప్తంగా శ్రీరాముని శోభ‌యాత్ర‌లు నిర్వ‌హించారు. అయితే, ప‌లు ప్రాంతాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఊరేగింపుల సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. ఆ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.

1. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లోని కొన్ని ప్రాంతాలు రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ కర్ఫ్యూ విధించినట్లు సీనియర్ అధికారి తెలిపారు. ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.

2. తలాబ్ చౌక్ ప్రాంతం నుంచి ప్రారంభమైన ఊరేగింపుపై లౌడ్ స్పీకర్ల నుండి వ‌చ్చే మ్యూజిక్ కార‌ణంగా జరిగిన ఈ వాగ్వాదంలో.. రాళ్లు రువ్వడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయని అదనపు కలెక్టర్ ఎస్ఎస్ ముజల్దే తెలిపారు. "పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు టియర్‌గ్యాస్ షెల్స్‌ను కాల్చవలసి వచ్చింది" అని వెల్ల‌డించారు. 

3. వాహనాలకు నిప్పు పెట్టడం, కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువు షెల్స్‌ ప్రయోగించడం వంటి దృశ్యాలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ చౌదరి సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. నాలుగు ఇళ్లకు నిప్పు పెట్టారు, ఒక దేవాలయాన్ని ధ్వంసం చేశారు.

4. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా ఖంభాట్ మరియు సబర్‌కాంత జిల్లా హిమ్మత్‌నగర్‌లలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు చోట్లా రాళ్లు రువ్వడం, వ‌స్తుల‌వుకు నిప్పుపెట్ట‌డం వంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు షెల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.