మధ్యప్రదేశ్ లో మరో హైటెక్ మాస్ కాపీయింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సింగ్ మొదటి సెమిస్టర్ విద్యార్థులు ఏకంగా మొబైల్స్ లో చూస్తూ పరీక్ష రాశారు. ఈ ఘటన మొరెనా జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇటీవలే ఇదే రాష్ట్రంలో ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుపడ్డారు. వైద్య విద్యార్థులు ఇలా కాపీయింగ్ కు పాల్పడటం చర్చనీయాంశం అవుతోంది.
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా ఆసుపత్రిలో పలువురు నర్సింగ్ కోర్సు విద్యార్థులు పరీక్ష సమయంలో మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు మొరెనాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రాక్టికల్ పరీక్షకు శుక్రవారం హాజరయ్యారు. అయితే ఈ సమయంలో ఈ మాస్ కాపీయింగ్ చోటు చేసుకుంది. వీడియోలో వీరు చేసిన పని స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులు తెల్లటి అప్రాన్ లను ధరించి తమ మొబైల్ ఫోన్‌ల నుండి కంటెంట్‌ను కాపీ చేస్తూ.. వారి ఆన్సర్ షీట్ లో రాశారు. వీరంతా నేలపై, మోరెనా ఆసుపత్రిలో చేరిన రోగుల బంధువులు ఎదురు చూసేందుకు ఏర్పాటు చేసిన కారిడార్ లో కూర్చొని పరీక్ష రాశారు. దీనికి సంబంధించి రెండు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఆసుపత్రి వర్గాల తెలిపిన వివరాల ప్రకారం.. వీరంతా నర్సింగ్ కోర్సు మొదటి సెమిస్టర్ విద్యార్థులు. వీరు మొరెనాలోని మూడు ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్నారు. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో బయట కూర్చున్న కొందరు వ్యక్తులు వాట్సాప్‌లో విద్యార్థులకు సమాధానాలు పంపించినట్టు కూడా తెలుస్తోంది. కొంతమంది విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాల కోసం నేరుగా నెట్ లోనే బ్రౌజ్ చేశారని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఈ మాస్ కాపీయింగ్ వ్యవహారం, పరీక్షల నిర్వహణపై విచారణ చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (సీఎంహెచ్‌ఓ) డాక్టర్ రాకేష్ శర్మ తెలిపారు.ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక అందిస్తుందని చెప్పారు. జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్‌కు కూడా నోటీసులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. నివేదికలు అందిన తరువాత చర్యలు తీకుంటామని అన్నారు. సంబంధిత కాలేజీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని చెప్పారు. మరోవైపు పరీక్షల్లో మాస్ కాపీయింగ్ గురించి తనకు తెలియదని మోరెనా జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ వినోద్ గుప్తా తెలిపారు.
ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా మాస్ కాపీయింగ్ పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఇది చోటుచేసుకుంది. ఈ కాపీయింగ్ కోసం ఇద్దరు విద్యార్థులు ఏకంగా సర్జరీ చేయించుకుని చెవిలో మైక్రో బ్లూటూత్ పెట్టించుకున్నారు. పరీక్ష ప్రారంభమైంది. అందరు విద్యార్థులతో పాటు వీరు కూడా పరీక్ష రాస్తున్నారు. అయితే పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత జబల్‌పూర్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కళాశాలలో తనిఖీలు చేయడానికి వచ్చింది. ఈ క్రమంలోనే అనుమానం కలిగి ఓ విద్యార్థిని ప్రశ్నించారు. దీంతో అతడు బయపడి మొత్తం విషయాన్ని చెప్పాడు. తనతో పాటు మరో విద్యార్థి కూడా ఇలా చెవిలో బ్లూటూత్ పెట్టుకున్నారని చెప్పాడు. దీంతో ఆ విద్యార్థిని కూడా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన గత నెల 23వ తేదీన వెలుగులోకి వచ్చింది.
